లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం
NANDYAL Aug29 :- శనివారం హాకీ మాంత్రికుడు పద్మభూషణ్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు కన్నయ్య సౌజన్యంతో క్రీడలను ప్రోత్సహిస్తున్న ఇద్దరు కోచ్ లకు నంద్యాల లయన్స్ క్లబ్ జాతీయ క్రీడా దినోత్సవ పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు.

చెస్ కోచ్ గా,నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శిగా ఎంతోమంది చెస్ క్రీడాకారులను తయారుచేసిన రామ సుబ్బారెడ్డి, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా క్రీడలను ప్రోత్సహించడంలో విశిష్ట కృషి చేసిన శ్రీనివాసులు లకు అంతర్జాతీయ లయన్స్ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్,ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ క్రీడలను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, దాతలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు యువత క్రీడలలో పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్రీడలు గెలుపోటములను స్వీకరించే మనస్తత్వం,ఓటమి చెందిన వారు తిరిగి విజయం కోసం ప్రయత్నించే స్వభావం, క్రమశిక్షణ,ఏకాగ్రత అలవాడతాయని అన్నారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ యూత్ బ్యాచ్ సభ్యులు వచ్చే నెలలో నంద్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ కు బహుమతుల కోసం 10 వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్,మేడా చంద్రశేఖర్,జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు, సంయుక్త కార్యదర్శి అమిదేల జనార్ధన్,కార్యక్రమానికి సహకరించిన కన్నయ్య, సీనియర్ సభ్యులు ఎం.పీ.వి.రమణయ్య, తోట శ్రీనివాస్, వాసు తదితరులు పాల్గొన్నారు.
Arattai