అమరావతి: విజయవాడలో ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సుమారు 11.5 కి.మీ.లు ఆటోలో ప్రయాణించారు. ఉండవల్లి నివాసం నుంచి ప్రకాశం బ్యారేజి, విఎంసి ఆఫీసు, కాళేశ్వరరావు మార్కెట్, ఏలూరు లాకులు, సీతంపేట గేటు, సింగ్ నగర్ ఫ్లైఓవర్, డాబాకొట్టు సెంటర్ మీదుగా మాకినేని బసవపున్నయ్య స్టేడియంకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా స్వర్ణలత అనే మహిళకు చెందిన ఆటోలో ప్రయాణించిన లోకేష్… ఆమెతో ముచ్చటిస్తూ కుటుంబ నేపథ్యం, ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల వివరాలను వాకబు చేశారు. తాము విజయవాడ ఆటోనగర్ లో నివాసం ఉంటున్నామని, మహిళను అయినప్పటికీ తన భర్త నమ్మకంతో తనను ఈ వృత్తిలో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

2014లో నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శిక్షణ పొందానని, బాబు గారి చేతులమీదుగానే షి ఆటోలను మాకు అందజేశారని ఆమె తెలిపింది. తమ కుమార్తె సిఎ చదువుతోందని, కుమారుడు ఆర్మీలో చేరాలని ఆసక్తిగా కనబరుస్తున్నాడని చెప్పింది. ప్రస్తుతం పెట్రోలు ఖర్చులు పోను నెలకు పదివేల వరకు సంపాదిస్తున్నానని తెలిపింది. ఎక్కువగా తమ ఆటోలో మహిళలే ప్రయాణిస్తుంటారని చెప్పింది.

మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో మీరు చూపుతున్న చొరవకు హ్యాట్సాప్ అని లోకేష్ కు స్వర్ణలత కృతజ్ఞతలు తెలిపారు. ఆటోడ్రైవర్ సేవలో పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు అందజేస్తున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. భార్యాభర్తలిద్దరూ చెరొక పని చేసుకుంటే కుటుంబాన్ని సాఫీగా నడపవచ్చని చెప్పిన మంత్రి లోకేష్.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Leave a Reply