నకిలీ మద్యం సరఫరాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి,9 అక్టోబరు:రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ మరియు భుగర్భ గనుల శాఖామాత్యులు కొల్లు రవీంద్ర వెల్లడించారు.ఈమేరకు గురువారం ఎపి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం నివారణకు ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్సుమెంట్ విభాగం సమర్ధవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.నవోదయం కింద ఇప్పటికే 21 జిల్లాలను సారా రహిత జిల్లాలుగా చేయడం జరిగిందని వివరించారు.అక్రమ మద్యం నియంత్రణపై ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఎట్టిపరిస్థితుల్లోను రాష్ట్రంలో అక్రమ మద్యం నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి రవీంద్ర పునరుద్ఘాటించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ఫోర్సుమెంట్ ను మరింత కట్టుదిట్టం చేయడం జరిగిందని దాంతో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల పనితీరు బాగా మెరుగుపడిందన్నారు.అదే విధంగా రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ల్యాబ్ లను ఏర్పాటు చేసి అవసరమైన తనిఖీలు చేసి నాణ్యమైన మద్యం సరఫరాకు తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు.నకిలీ మద్యం తయారీ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని గత ప్రభుత్వం నకిలీ మద్యం విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించిందని కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం తయారీపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి సామాన్యుడికి కూడా అందుబాటులో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.నకిలీ మద్యం విషయాన్ని కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

ఫేక్ ప్రచారాలతో ఉద్దేశ్య పూర్వకంగా వైసిపి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని ప్రయత్నిస్తోందని నకిలీ మద్యంపై విష ప్రచారానికి తెరలేపారని ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు.నకిలీ మద్యంపై మాజీ సియం తన సొంత మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారని తప్పుడు కథనాలపై విచారణ జరిపించి నిజా నిజాలు నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు.ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా లేదా సోషల్ మీడియాలో గాని తప్పుడు కధనాలు,ప్రసారాలు ద్వారా ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నాలు చేసే వారిపై బిఎన్ఎస్ 353 (భారతీయ న్యాయ సంహిత)కింద అదే విధంగా తప్పుడు వార్తలు,ప్రసారాలు ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వారిపై బిఎన్ఎస్ 356 కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.2019-2024 గత ప్రభుత్వ హయంలోని నకిలీ మద్యం అంశాలపై కూడా పూర్తిగా దర్యాప్తు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి అసిస్టెంట్ కమీషనర్ ఎన్ఫోర్సుమెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు 30 కేన్ల నకిలీ మద్యాన్ని,కొన్ని కార్టన్లు,ఫేక్ లేబుళ్లు,క్యాప్ సీలింగ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మంత్రి రవీంద్ర చెప్పారు. తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాస్ కు ఈనకిలీ మద్యం కేసుతో సంబంధం ఉందని,జయచంద్రా రెడ్డి అనే వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఉందని ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి షాపులపైనా తనిఖీలు జరిగాయని జనార్దన్ సోదరుడు అద్దెపల్లి జగన్ మోహన్ రావును కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ కు ఈ కేసుతో సంబంధం ఉందని టీడీపీకి చెందిన జయచంద్రారెడ్డిపై వెంటనే పార్టీపరంగా చర్యలు తీసుకున్నామని,నిర్లక్ష్యం వహించిన ఎక్సైజ్ ఎస్ఐని సస్పెండ్ చేశామని వివరించారు. ఈసంఘటనకు బాధ్యులైన వారి అందరిపైనా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోడవం జరుగుతుందని తెలిపారు.కాగా నకిలీ మద్యం కేసుతో సంబంధం ఉన్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావుపై వైసీపీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మంత్రి రవీంద్ర అన్నారు.

ఈమీడియా సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమీషనర్ శ్రీధర్,ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పాల్గొన్నారు.

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి: మంత్రి సవిత