సీనియర్ అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవికృష్ణ,డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మాధవి లను సత్కరించిన నంద్యాల ఐఎంఏ వైద్యులు
వైద్య రంగ పురోగతిలో అనస్థీషియా వైద్యులదే కీలక పాత్ర: డాక్టర్ రవి కృష్ణ
ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని గురువారం రాత్రి ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల సహకారంతో స్థానిక మధుమణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.

ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ రాజంపేటకు చెందిన డాక్టర్ బాలరాజు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు లు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.నంద్యాలలో ఉన్న అనస్థీషియా వైద్యులు అనస్థీషియా పితామహుడు విలియం థామస్ గ్రీన్ మార్టన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1846 అక్టోబర్ 16వ తేదీ అమెరికా మాసచూసేట్స్ నగరంలో విలియం థామస్ గ్రీన్ మార్టన్ మొట్టమొదటిసారిగా మత్తుమందు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగిందని అందువలన అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు అని తెలిపారు.వైద్య రంగ పురోగతిలో అనస్థీషియా వైద్యుల దే కీలక పాత్ర అని అన్నారు.

డాక్టర్ మధుసూదన రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో దాదాపు 30 మంది అనస్థీషియా వైద్యులు సేవలు అందిస్తున్నారని తద్వారా ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ప్రజలు చేయించుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు.

డాక్టర్ బాలరాజు, డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ అనస్థీషియా రంగంలో వచ్చిన వినూత్న మార్పులు,ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిందన్నారు.

ఈ సందర్భంగా నంద్యాల మొట్టమొదటి అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవికృష్ణ, సీనియర్ అనస్థీషియా వైద్యులు శాంతిరాం వైద్య కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, మహిళా అనస్థీషియా వైద్యులలో సీనియర్ అయిన డాక్టర్ మాధవీ లను ఐఎంఏ నంద్యాల శాఖ తరపున ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా” ఆపరేషన్ థియేటర్ బయట అనస్థీషియా వైద్యుల పాత్ర” పై డాక్టర్ నాగరాజా రెడ్డి,”అనస్థీషియా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై ” డాక్టర్ రవితేజ మల్టీమీడియా సహకారంతో ప్రసంగించారు. సదస్సులో ప్రసంగించిన వీరికి ఐఎంఎ నంద్యాల జ్ఞాపికలు ఇచ్చి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు .
Leave a Reply