NANDYAL,Oct 21:-పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల రక్షణ కోసం త్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిపేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం (బొమ్మలసత్రం)లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు తదితరులు హాజరయ్యారు.

ముందుగా పెరేడ్ కమాండర్ జి. బాబు గారి వద్ద నుండి జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం AR DSP శ్రీనివాసరావు గారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల వివరాలను అందరికీ తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అత్యంత కష్టతరమైనదని, పగలు-రాత్రి, ఎండ-వాన తేడా లేకుండా విధులు నిర్వర్తించడం పోలీసుల నిత్యజీవితంలో భాగమని అన్నారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ బాధ్యతలను సమన్వయపరచడం ఎంతో సవాలుగా ఉంటుందని పేర్కొన్నారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసి, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని, పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం నాలుగు నెలలు పూర్తయిన నేపథ్యంలో పోలీసు శాఖ అందించిన సహకారం విశేషమని, వారి కృషి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కీలకమైందని కలెక్టర్ ప్రశంసించారు.

జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో కష్టసాధ్యమైనదని, ఎండ, వాన, చలి, పగలు-రాత్రి తేడా లేకుండా ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇటీవల విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్‌ను స్మరించుకుంటూ, పోలీసుల సేవలు సమాజ రక్షణలో అపారమైనవని పేర్కొన్నారు.
1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్‌స్ప్రింగ్ ప్రాంతంలో చైనా దాడిని ఎదుర్కొంటూ వీరమరణం పొందిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసు అమరవీరుల దినోత్సవానికి ప్రేరణగా నిలిచారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ, ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదర్శంగా తీసుకుని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసు సోదరులను స్మరించుకోవడం, వారి కుటుంబ సభ్యులను సన్మానించడం అత్యంత గర్వించదగ్గ విషయమన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా ప్రజల రక్షణ కోసం పోరాడతారో, సమాజంలో చట్ట-వ్యవస్థ పరిరక్షణలో పోలీసుల పాత్ర కూడా అంతే గొప్పదని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన నేపథ్యంలో పోలీసు విధులలో ఒత్తిడి ఎక్కువవుతున్నా, పోలీసులు సమాజ శాంతి-భద్రతల పరిరక్షణలో అచంచలంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
Leave a Reply