NANDYAL Oct27 :-ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రజల నుండి సేకరించే అభిప్రాయాల ప్రక్రియలో నంద్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం, ప్రజాభిప్రాయ సేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన రెవెన్యూ, సర్వే, గృహనిర్మాణం, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, పింఛన్ పంపిణీ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్య సేవలు, తదితర విభాగాల్లో ప్రజాభిప్రాయ సేకరణలో అసంతృప్తికర స్పందనలు రాష్ట్ర స్థాయిలో నమోదైన నేపథ్యంలో సంబంధిత అధికారులు సమన్వయంతో సరిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలు ప్రభుత్వ సేవలను ఎలా అనుభవిస్తున్నారన్నదానికి ప్రతిబింబమని ప్రతి అధికారి తమ పరిధిలోని సచివాలయాల పనితీరును సమీక్షించి, తగు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని 13 సచివాలయాలు ప్రజాభిప్రాయ సేకరణలో దిగువ స్థానంలో ఉన్నాయని, ఇది సిబ్బంది పనితీరు అసంతృప్తికరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోందన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, ఆయా సచివాలయ సిబ్బందిపై, సంబంధిత తహసీల్దారులు, ఆర్డీవోలపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదన్నారు. పనితీరు మెరుగుపరుచుకుని ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అలాగే డోన్, బేతంచర్ల, ఆత్మకూరు మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు అసంతృప్తికరంగా ఉన్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైనట్లు తెలిపారు. పారిశుధ్య కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రతీ మున్సిపాలిటీ మరియు గ్రామ సచివాలయ పరిధిలో రోజువారీ శుభ్రత పనులను పర్యవేక్షించాలన్నారు.
ప్రజల అభిప్రాయాల ద్వారా ప్రభుత్వ పథకాల పనితీరు అంచనా వేయబడుతుందని, అందుకే ప్రతి శాఖ ప్రజల సంతృప్తిని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆమె అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడానికి అధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ డిఆర్ఓ రాము నాయక్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Arattai