ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నగదు బహుమతులు
చదరంగం ఏకాగ్రతను పెంచుతుంది: డాక్టర్ రవి కృష్ణ
నిరంతర సాధన విజయానికి సోపానం: డాక్టర్ సహదేవుడు.
NANDYAL Nov 2 : నంద్యాల జిల్లా చెస్ సంఘం,నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో ఆదివారం స్థానిక ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ స్పాన్సర్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి, ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇనుముడింప చేస్తుందని తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు.

ఆత్మకూరు సుదర్శనం శెట్టి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పిల్లలలో దుష్ప్రభావం చూపుతున్నదని,దాని నుంచి పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చేస్తే పిల్లలలో మేధో వికాసం జరుగుతుందన్నారు.

డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, కళలు వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు.విద్యార్థులు క్రీడలలో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. క్రీడలలో నిరంతర సాధన విజయానికి సోపానం అన్నారు.

నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి, డాక్టర్ గెలివి సహదేవుడు చదరంగం బోర్డుపై పావులు కదిలించి పోటీలు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ వెంకటరావు, లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్, గెలివి శ్రీకాంత్,ఆర్బిటర్ సుజాత, వ్యాయామ ఉపాధ్యాయులు కళ్యాణ చక్రవర్తి, 150 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Arattai