ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్”(సి. పి. బ్రౌన్) జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రపండుగగా ప్రకటించడం పట్ల నంద్యాల సాహితీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.మాతృభాషా పరిరక్షణ సమితి నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్య కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సిపి బ్రౌన్ జయంతి వేడుకలకు పలువురు సాహితీ సంఘ ప్రతినిధులు హాజరయ్యారు.
సిపి బ్రౌన్ చిత్రపటానికి పుష్పాంజలులు ఘటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాతృభాషా పరిరక్షణ సమితి గౌరవ సలహాదారులు విశ్రాంత శాస్త్రవేత్త డా.రవీంద్రనాథ్ మాట్లాడుతూ బ్రౌన్ తెలుగు సాహిత్య సంరక్షణకు ఎనలేని కృషి చేశారన్నారు. తన జీతంతో పండితులకు జీతమిచ్చి మరుగునపడ్డ ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి,పరిష్కరింపచేసి, ప్రచురింపజేశారని తెలిపారు.
డాక్టర్ కిషోర్ కుమార్,అన్నెం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో తెలుగు సూరీడుగా మిగిలిపోయిన కారణజన్ముడు బ్రౌన్ అన్నారు.ఆయనే లేకుంటే మనం ఈరోజు చదువుకుంటున్న ప్రాచీన తెలుగు కావ్యాలు తాటాకులలోనే నిద్రించి శిధిలమైపోయి ఉండేవని తెలిపారు.
తెలుగులో మాట్లాడితే తప్పు చేసినట్లు భావించే విషసంస్కృతి వేళ్లూనుకున్న ఈ రోజుల్లో రెండు శతాబ్దాలక్రితమే
ఒక విదేశీఉద్యోగి, తన ఉద్యోగంతో సంబంధంలేకున్నా సాంస్కృతిక నిబద్ధత కలిగి తెలుగు భాష వైభవానికి కృషి చేశారని రచయిత రామకృష్ణారెడ్డి తెలిపారు.
రైతు సమాఖ్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ బ్రౌన్ తన వ్యక్తిగత జీవితంలో అధిక భాగాన్ని తెలుగుభాష అభ్యున్నతికి కేటాయించడం అభినందనీయమన్నారు.. బ్రౌన్ జీవిత విశేషాలు గురించి కవి కొప్పుల ప్రసాద్ వినిపించిన కవితలు అందర్నీ అలరించాయి.
తెలుగు భాషా వైభవానికి కృషి చేస్తున్న రచయితలు కవులు కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ, రామకృష్ణారెడ్డి తదితరులను నంది రైతు సమాఖ్య మరియు వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి తూము శివారెడ్డి, కృష్ణారెడ్డి మాధవస్వామి, హరినాథ్ రెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Arattai