నూతన గ్రామ సచివాలయ భవనం, సీసీ రోడ్డు ప్రారంభించిన మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL Dec 01:- ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిరుపేద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. సోమవారం నంద్యాల మండలంలోని భీమవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గారితో కలిసి ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెల 1వ తేదీన లబ్ధిదారులందరికీ పింఛన్లు అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందన్నారు. 1వ తేదీ సెలవు రోజు వస్తే ముందురోజే పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు, వికలాంగులు, విధవుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి పింఛన్లు సమయానికి అందుతున్నాయా? పంపిణీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా?…అని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పింఛన్ మంజూరు కాలేదని బాధతో విన్నవించిన ఒక మానసిక వికలాంగుడి దరఖాస్తును స్వీకరించి, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు… అనేక కుటుంబాలకు ఇది జీవనాధారంగా మారిందన్నారు.

భీమవరం అభివృద్ధికి నూతన బాటలు
పెన్షన్ పంపిణీ అనంతరం మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి భీమవరం గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, అలాగే 7 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సచివాలయం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసే కేంద్రమని…. ఈ నూతన భవనం ద్వారా భీమవరం ప్రజలకు మెరుగైన పరిపాలన, వేగంగా సేవల అందుబాటు కలుగుతుందన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఎంపీపీ, మండల రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Arattai