NANDYAL Dec 01 :- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సేవల పట్ల ప్రజల అభిప్రాయాన్ని మెరుగుపరిచే విధంగా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పిజీఆర్ఎస్ హాలులో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆమె శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయనే అంశంపై వివిధ మార్గాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతోందని తెలిపారు. వాటిలో వైద్యఆరోగ్య, దేవాదాయ, సర్వే, వ్యవసాయ శాఖలపై ప్రజల నుండి మిశ్రమ స్పందన లభించిందని పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ విషయంలో 63 శాతం ప్రజలు సంతృప్తి, 37 శాతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రతపై 57 శాతం సంతృప్తి, 43 శాతం అసంతృప్తి వ్యక్తమైనట్లు వెల్లడించారు. శ్రీశైల నియోజకవర్గంలో వైద్యసేవలను మెరుగుపర్చే అంశంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని డీఎంహెచ్ఓకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
దేవాదాయ శాఖలో భాగంగా బేతంచర్ల శ్రీ మద్దిలేటిస్వామి దేవస్థానంలో త్రాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, ప్రసాద నాణ్యతను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

వ్యవసాయ శాఖపై ప్రజా అభిప్రాయం సందర్భంగా, జిల్లాలో ఎరువుల లభ్యతపై 39 శాతం సంతృప్తి, 61 శాతం లోపాలున్నట్లు ప్రజలు తెలుపడంతో, ఆ విషయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు.
సబ్సిడీ విత్తనాల సరఫరా అంశంలోనూ స్పష్టమైన వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో, సమర్థతతో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Arattai