యువత నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా కోర్సులు రూపొందించండి
NANDYAL Dec09: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ను జనవరి మూడో వారంలో ప్రారంభించే చర్యలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన DLRAC (జిల్లా స్థాయి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సలహా కమిటీ) సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.సమావేశంలో యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ నరసింహారావు, ఎల్డిఎమ్ రవీంద్ర కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న యువతకు మెరుగైన నైపుణ్య మెళకువలు అందించడానికి యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ తదితర కోర్సులు చదివిన యువతకు ఉచిత శిక్షణ, ప్రతి బ్యాచ్లో 60 మంది అభ్యర్థులకు వసతి, భోజనం సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వారు స్వయం ఉపాధి సాధించేలా కోర్సులను రూపొందించాలని బ్యాంకు అధికారులను ఆమె సూచించారు. జిల్లా ప్రత్యేకతలకు అనుగుణంగా కోర్సులు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేస్తూ తిరుపతి, మహానంది వంటి దేవస్థానాల్లో వాడే పూలతో అగరబత్తుల తయారీ, అరటి నార, గుర్రపుడెక్కతో చీర తయారీ వంటి వాటిల్లో శిక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యాటక ప్రాంతాలు అధికంగా ఉన్నందున పర్యాటక రంగానికి అనుసంధానమైన శిక్షణలు, సోలార్ ఫలకాలు అమరిక, డ్రోన్ మరమ్మత్తు శిక్షణ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని ఆమె సూచించారు. జిల్లాలో యువత స్వయం ఉపాధి మార్గంలో ముందుకు సాగేందుకు RSETI ఒక కీలక వేదికగా నిలవాలని కలెక్టర్ సూచించారు.
Arattai