MANGALAGIRI Dec 15:- తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆంధ్ర రాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు ఏవీ రమణ, నేతలు పర్చూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ..పొట్టి శ్రీరాములు గారి త్యాగం కేవలం భౌగోళిక సరిహద్దుల ఏర్పాటు కాదని, అది మన భాష, సంస్కృతి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వారు చేసిన మహోన్నత త్యాగమని వివరించారు.

వారు చేసిన సేవలు పరిమిత కాలానికి సంబంధించినవి కావు. వారి యొక్క సేవా తత్పరత, నిస్వార్థ గుణం వారి వయస్సును మించిన పరిపక్వతను చాటుతాయి. ఒక గొప్ప ఆశయం కోసం 58 రోజుల పాటు ఆహారం, నీరు కూడా లేకుండా వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష… అది సాధారణమైన కృషి కాదు, అద్భుతమైన సంకల్ప బలమని అన్నారు.
వారి త్యాగం ద్వారానే తెలుగు ప్రజల కల సాకారమైందని, మన భాషకు, మన ఉనికికి ఒక గుర్తింపు లభించిందని, వారు ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న ప్రత్యేక స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిదన్నారు. అనంతరం శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు తన కృషి, సేవా భావంతో ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన జీవితం ప్రజలకు మార్గదర్శకంగా ఉంటుంది. ఆయన చూపిన స్ఫూర్తిని మనం నిత్యం అనుసరించి, సమాజానికి సేవ చేయాలి అన్నారు.
Arattai