NANDYAL JAN19:- మనిషి మారితే సమాజం మారుతుందనే సందేశాన్ని అందించిన గొప్ప మానవతావాది,ప్రజల గుండెల్లో నిలిచిన తత్త్వవేత్త వేమన అని సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షులు యం.శ్రీనివాసమూర్తి అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సోమవారం నంద్యాలలోని పింగళిసూరన శాఖా గ్రంథాలయంలో ప్రజాకవి వేమన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సాహితీవేత్తలు వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సత్యం చెప్పడం ధైర్యం, శ్రమను గౌరవించడం సంస్కారం, మనిషిని మనిషిగా చూడటం మానవత్వం ఇవే వేమన బోధించిన జీవన సూత్రాలన్నారు. సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డా.నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేమన సమాజంలోని కులవ్యవస్థను, అంధ విశ్వాసాలను తన పద్యాల ద్వారా నిర్భయంగా ప్రశ్నించాడన్నారు.

ముఖ్యఅతిథి చిన్నయసూరి సాహితీ సమితి అధ్యక్షులు డా.వైష్ణవ వేంకట రమణమూర్తి మాట్లాడుతూ వేమన చెప్పిన తత్త్వం కాలాతీతమైంది. అవీనీతి,అసమానత నిండుకున్న నేటి సమాజానికి వేమన పద్యాలు మార్గదర్శకం అవుతాయన్నారు. ఎన్ జీ ఓ నాయకులు హుసేన్ రెడ్డి, మణిశేఖరరెడ్డి మాట్లాడుతూ వేమన కవిత్వంలో మనకు ఒక తిరుగుబాటు, సంఘసంస్కరణ కనిపిస్తుంది. ఆయన పలుకులు మన జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు.

“వేమన దార్శనికత” అనే అంశంపై జరిగిన సదస్సులో కవిరాజు గంగుల నాగరాజు, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి గోపాల్, దంత వైద్యులు కిషోర్ మాట్లాడుతూ నేటి సమాజానికి వేమన సాహిత్యం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు.

కవులు నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, రఫీ,మాబూబాషా,నరేంద్ర చేసిన పద్యాలాపన అందరినీ అలరించాయి. రోటరీ స్కూల్ విద్యార్థులు ఆలపించిన వేమన పద్యాలు ఆకట్టుకున్నాయి. పద్యాలాపన చేసిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అవ్వారి శేషఫణి, లలితా సరస్వతి,అన్నెం శ్రీనివాసరెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు వెంకటసుబ్బయ్య, వెంకటేష్ ,రమేష్, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Arattai