NANDYAL Feb 14:- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. శనివారం భారతీ సీడ్స్ కార్యాలయంలో మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత శాస్త్రవేత్త డా కాదరబాద్ రవీంద్రనాథ్ హాజరయ్యారు.
వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు,కవులు, నంది రైతు సమాఖ్య సభ్యులు సంజీవయ్య చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా.రవీంద్రనాథ్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య గారికి తమ తండ్రి గారైన కాదరబాద్ నరసింగరావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన సంజీవయ్య పట్టుదలతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగిన ప్రస్థానాన్ని స్మరించారు.
ప్రధాన వక్త డా.గెలివి సహదేవుడు మాట్లాడుతూ సమానత్వం,సామాజిక న్యాయం ప్రజాసంక్షేమం పట్ల సంజీవయ్య చూపిన అంకితభావం నేటి తరానికి ఆదర్శమన్నారు. సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సంజీవయ్య గారు పేదల అభ్యున్నతికి కృషి చేసి తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారని పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. రోటరీ విద్యాసంస్థల అధినేత సుబ్బయ్య మాట్లాడుతూ సంజీవయ్య గారు విలువలు చెప్పడమే కాకుండా వాటిని ఆచరణలో చూపించిన రాజనీతిజ్ఞుడని కొనియాడారు.
మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టు,వరదరాజస్వామి ప్రాజెక్టు,పులిచింతల,వంశధార,నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో సంజీవయ్య గారి కృషి ఎనలేనిదన్నారు. వారి ఆదర్శాలతో నేటి యువత ముందుకు నడవాలన్నారు.

ఈ సందర్భంగా వైద్య,సాహితీ,సేవారంగాలలో విశేషకృషి చేస్తున్న డా.గెలివి సహదేవుడు,డా.కురుమేటి కిశోర్ కుమార్ లను ఘనంగా సత్కరించారు. దామోదరం సంజీవయ్య జీవితవిశేషాలపై కవులు నీలకంఠమాచారి,కొప్పుల ప్రసాద్ ,డా.నీలం వెంకటేశ్వర్లు,అవ్వారి శేషఫణి, రఫీ,మాబుబాష కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నిర్వాహకులు కృష్ణారెడ్డి, ఓబుళపతి తదితరులు పాల్గొన్నారు.
Arattai