NANDYAL Feb 23:- రేనాటి సూర్యచంద్రులు గా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ,బుడ్డా వెంగళ రెడ్డి సంస్మరణ సభను నంద్యాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సాయిబాబా నగర్ లో శ్రీశైల పబ్లిక్ స్కూల్ నందు “రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి” అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త డా. కె.రవీంద్రనాథ్ , ప్రధాన వక్తలు డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు, డాక్టర్ తొగడ సురేష్ బాబు , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దేశం సులోచన, ఉయ్యాలవాడ, బుడ్డా వంశీకులు గోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి,నంది రైతు సమాఖ్య అధ్యక్షులు బెక్కెం రామసుబ్బారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ఆర్ వి సుబ్బారెడ్డి, కాతా రామిరెడ్డి ,కర్నాటి నారాయణరెడ్డి, బుడ్డా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి, చిత్రపటాలతో పాటు వారి త్యాగాలను వెలుగులోకి తెచ్చిన చరిత్రకారులు, ప్రముఖులు తంగిరాల సుబ్బారావు, ముక్కమల్ల నారాయణరెడ్డి, పల్లేటి లక్ష్మీ కులశేఖర్ , గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య, నంద్యాల గాంధీగా కీర్తి గడించిన కాదర్ బాద్ నరసింగరావు తదితరుల చిత్రపటాలకు అతిథులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రేనాటి సూర్యచంద్రుల వర్ధంతి సభలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని , స్వాతంత్ర వీర సింహం నరసింహారెడ్డి గారి గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువచ్చామన్నారు. రేనాటి సూర్యచంద్రుల చరిత్రకు సంబంధించి పలు పుస్తకాలు ప్రచురించామని తెలిపారు. నరసింహారెడ్డి త్యాగము, వీర ,శౌర్యాలను గురించి బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వము గురించి నేటి తరాలకు తెలియజేశాల్సిన బాధ్యత మనకుందన్నారు. గత రెండు దశాబ్దాలుగా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను కార్యదర్శి కర్నాటి రామకృష్ణారెడ్డి వివరించారు.

డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ భరతమాత స్వేచ్ఛ కొరకు విదేశీయులపై అలుపెరగని పోరాటం చేసి చివరకు తన ప్రాణాన్ని భరతమాత దివ్య చరణాల ముందు సమర్పించిన యుద్ధ వీరుడు నరసింహారెడ్డి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. డా.రవీంద్రనాథ్ మాట్లాడుతూ రేనాటి గడ్డ మహనీయులను మననం చేసుకోవడానికి రేనాటి సూర్య చంద్రుల స్మారక సమితి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. స్మారక సమితి కృషి వల్ల ఉయ్యాలవాడ, బుడ్డా వెంగళ రెడ్డి చరిత్ర వెలుగులోకి వచ్చిందన్నారు.
ప్రధాన వక్త తొగడ సురేష్ బాబు మాట్లాడుతూ దేశంపై మాతృ భూమిపై భక్తిని ప్రదర్శించి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి తెల్ల దొరల దురహంకారాన్ని ఎదిరించడానికి పూనుకున్న మహా పరాక్రమశాలి నరసింహారెడ్డి,మనుషుల్ని మానవతా హృదయంతో అక్కున చేర్చుకుని అన్నపానాదులకు లోటు లేకుండా దాతృత్వాన్ని చాటిన బుడ్డా వెంగళరెడ్డి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆర్ వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కలియుగ దాన కర్ణుడి గా పేరుగాంచిన బుడ్డా వెంగళ రెడ్డికి దాతృత్వములో ఎవరు సాటి లేరన్నారు.

మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దేశం సులోచన ప్రసంగిస్తూ ప్రధమస్వాతంత్ర సమరబీజం నాటిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవ గర్జనలు భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదాయన్నారు. పౌరుష, పరాక్రమాలలో పేరుగాంచిన ఉయ్యాలవాడ, బుడ్డా వెంగళ రెడ్డి లు భారతావని ముద్దుబిడ్డలని పేర్కొన్నారు. శ్రీశైల పబ్లిక్ స్కూల్ విద్యార్థుల దేశభక్తి గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.కార్యక్రమంలో మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి , శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుపెంరెడ్డి, సాయిరాం రెడ్డి, శ్రీమతి వసుంధర, నంది రైతు సమాఖ్య ప్రతినిధులు కృష్ణారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, ఓబులపతి, మురళీ కృష్ణారావు, బీరం శ్రీనివాస రెడ్డి కవులు మహమ్మద్ రఫీ, డా.నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, ఓబులేసు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
Arattai