NANDYAL Feb27:- జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఎన్కోర్డ్ (NCORD) జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగంపై ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ఎక్సైజ్, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

యువతను రక్షించేందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్య కమిటీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నాటు సారా తయారీ జరుగుతున్న చెంచు తాండాలు మరియు మారుమూల గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి, ఆ కుటుంబాలను నాటు సారా తయారీ నుండి పూర్తిగా విముక్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా నందికొట్కూరు మండలంలోని షికారు కాలనీ వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి అక్రమ మద్యం తయారీని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి అక్రమంగా దిగుమతి అవుతున్న గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు చేపడుతోందన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మత్తు పదార్థాల విక్రయాలపై దాడులు కొనసాగిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాలు లభ్యమవుతున్న ప్రదేశాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యాసంస్థల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఎక్సైజ్, పోలీస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీఈవో, ఐసిడిఎస్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Arattai