నంద్యాలలో తెలుగు వెలుగుల జాతర
NANDYAL Aug29 :- నంద్యాల హనీఫ్ నగర్ లోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో “మాతృభాషా పరిరక్షణ సమితి “ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ముందుగా తెలుగు తల్లి మరియు గిడుగు రామ్మూర్తి పంతులు గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి వేడుకలు ప్రారంభించారు.

రోటరీ స్కూల్ కరస్పాండెంట్ డి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ తమ పాఠశాల మాతృభాషా పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటుందని, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థుల్లో తెలుగుపై మమకారం పెంపొందించడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
“మధుర వాగ్వసంత” బిరుదాంకితులు, మాతృభాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు మాట్లాడుతూ తెలుగు కేవలం భాష కాదని, అది మన జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. గిడుగు వారి స్ఫూర్తితో వ్యవహారిక తెలుగుకే పట్టం కట్టాలని, పరభాషా మోజులో పడి మాతృభాషను మరువడం వేరును నరుక్కుని చెట్టును పెంచాలనుకోవడమేనని హితవు పలికారు.మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు సమితి చేస్తున్న నిరంతర కృషిని వివరించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శేషఫణి మాట్లాడుతూ బాల్యంలో తెలుగు పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తు దృఢంగా ఉంటుందని పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ కవులు మహమ్మద్ రఫీ, నీలకంఠమాచారి, మహబూబ్ బాషా గార్లు తమ స్వీయ కవితలతో తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని చాటి సభికులను మంత్రముగ్ధులను చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు తెలుగు భాషా వైభవంపై ప్రసంగాలు, జానపద గేయాలు, అందరినీ విశేషంగా అలరించాయి.ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులను, కవులను పాఠశాల కరస్పాండెంట్ డి.వి. సుబ్బయ్య పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Arattai