యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా యువజన సంక్షేమ శాఖ–సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న నంద్యాల జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ యువత తమ ప్రతిమను ప్రదర్శించడానికి యువజన ఉత్సవాలు అద్భుత వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖాధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 29న నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగాల్లో నిర్వహించబడతాయని…. వీటిలో 1) జానపద నృత్యం (గ్రూప్), 2) జానపద గీతం (గ్రూప్), 3) కథా రచన, 4) కవితా రచన, 5) డిక్లేమేషన్ (ప్రసంగ పోటీ), 6) పెయింటింగ్, 7) ఇన్నోవేషన్ – సైన్స్ మేళా ఉన్నాయని సెట్కూరు సీఈఓ డా కె. వేణుగోపాల్ తెలిపారు.
జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, మరియు పాల్గొన్న కళాకారులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేయబడతాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన యువతీ యువకులు తమ పేరు లేదా బృందం పేరును వెబ్ లింక్ https://bit.ly/ndldyf25 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వారు అక్టోబర్ 29న ఉదయం 9.00 గంటలలోపు నేరుగా కళాశాలలో వచ్చి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
పూర్తి వివరాలకు మొబైల్ నంబర్లు 92922 07601, 83281 81581లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామ్ బాబు పాల్గొన్నారు.
Leave a Reply