జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీలలో పతకాలు సాధించిన నంద్యాల వాసి పారా ఒలంపియన్ అర్షద్ షేక్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అభినందించారు.నంద్యాల కలెక్టరేట్ నందు డిఎస్డివో ఆధ్వర్యంలో పారా ఒలంపియన్ అర్షద్ షేక్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన అర్షద్ షేక్.. జాతీయస్థాయిలో బాడీ బిల్డింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, టైతలాన్, వీల్ చైర్ ఫెన్సింగ్ తదితరాలలో పాల్గొని పథకాలు సాధించారని కలెక్టర్ కు వివరించారు. అలాగే 2020లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒంటి కాలితో సైకిల్ తొక్కడం జరిగింది. దాదాపు 60 సంవత్సరాల తర్వాత దేశం తరఫున అంతర్జాతీయంగా 2024లో పారిస్ లో జరిగిన పారా ఒలంపిక్స్ నందు పారాసైక్లింగ్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది జాతీయస్థాయిలో హైదరాబాదులో నిర్వహించిన పారాసైక్లింగ్ లో పాల్గొని గెలిచి జాతీయ ఛాంపియన్ గా పతకం సాధించారు. ఇప్పటివరకు దాదాపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 15 మెడల్స్ సాధించారని, దేశంలో మొదటి స్థానం, ఏషియాలో రెండవ స్థానం, ప్రపంచంలో ఐదవ స్థానం ర్యాంకు లో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్షద్ షేక్ జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది క్రీడలలో రాణించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, డిఎస్డివో రాజు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply