వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరు చేసిన పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నంద్యాల పార్లమెంట్ సభ్యులు, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్ బైరెడ్డి శబరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో దిశ కమిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఎంపీపీలు, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంతో వందల కోట్లు వెనక్కి వెళ్ళిపోవడం బాధాకరమన్నారు. కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయి సక్రమంగా సద్వినియోగం చేసుకొని జిల్లా ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నంద్యాల జిల్లాను రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.
జిల్లాలోని ఏఏ శాఖలకు ఏమేమి నిధులు అవసరమో అందుకు సంబంధించిన నివేదిక తయారు చేసి తమకు పంపాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా విద్యాశాఖలో మరమ్మతులకు గురైన భవన నిర్మాణాల కొరకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. తరగతి గదులు మరమ్మతులకు గురి కావడంతో వర్షాకాలం వచ్చినప్పుడు పిల్లలు పాఠశాలలకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను తరగతి గదుల నిర్మాణాలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన 60 శాతం వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రైతులకు నష్టం లేకుండా లాభం చేకూరే విధంగా పనులు చేస్తూ రైతులను ప్రోత్సహించాలన్నారు. కొన్నిచోట్ల జాతీయ రహదారులు మరమ్మతరోకు గురై వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్య పరిష్కరించేందుకు నేషనల్ హైవే అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు.జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కొళాయి కనెక్షన్ కార్యక్రమాన్ని పక్కాగా పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.
రైతుల శ్రేయస్సు కోసం భూసార పరీక్ష కేంద్రాలను పెంచాలి
జిల్లాలో రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,600 సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. అదే విధంగా భూసాంద్రత ఎంత మేరకు ఉందో అని తెలుసుకోవడానికి ఉన్న భూసార పరీక్షలు కేంద్రాలకు సంబంధించి జిల్లాలో 56 మినీ ల్యాబ్స్, 2 స్టాటిక్ ల్యాబ్స్ ఉన్నాయని కానీ జిల్లాలో కేవలం ఒక్క భూసార పరీక్ష కేంద్రం మాత్రమే వినియోగం ఉందన్నారు.

అలా కాకుండా మిగతా భూసార పరీక్ష కేంద్రాలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మకు సంబంధించిన నగదును కూడా పూర్తి స్థాయిలో వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఎంపి ఆదేశించారు. పశు సంవర్థక శాఖకు సంబంధించి బ్రూసెల్లోసిస్ వాక్సినేషన్ ను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లాలో 5.20 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కోసం ఈ-కెవైసి చేయడం జరిగిందని, కానీ కేవలం 37 వేలు మాత్రమే ఫిజికల్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందని పెండింగ్ ఉన్న కార్డులు త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అదే విధంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కు సంబంధించి 230 విలేజ్ హెల్త్ క్లినిక్స్ బాడుగ భవనాల్లో ఉన్నాయని ముఖ్యంగా నందికొట్కూరు మండలం, కడుమూరు గ్రామంలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ సరిగ్గా లేపోవడం వల్ల ఎంపి ల్యాండ్స్ క్రింద ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. యూపిహెచ్సిలు కొత్తగా గ్రామీణ ప్రాంతానికి 8, అర్బన్ ప్రాంతానికి 3 మంజూరు చేయడం జరిగిందని అందుకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించి ముఖ్యంగా నందికొట్కూరు, శ్రీశైలం ప్రాంతాల్లో ఉన్న పాఠశాలకు ప్రహారీ గోడలు లేవని అందుకు సంబంధించి వివరాలు అందజేయాలని సంబంధిత అధికారిని ఎంపి ఆదేశించారు.
అంతేకాకుండా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్షిప్ లు ప్రధాన్ మంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ క్రింద 80 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. త్రాగు నీటి సరఫరాకు సంబంధించి ఆర్ఓ ప్లాంట్ల మంజూరు చేయడం, కానీ కొన్ని చోట్ల బోర్, విద్యుత్ కనెక్షన్లు ఉండడం లేదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఎంపి ఆదేశించారు. రహదారి పనులకు సంబంధించి నాణ్యతతో పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను దిశా కమిటీ ఛైర్మన్ ఆదేశించారు.*
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల అమలును పటిష్టవంతంగా చేపట్టి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. అలా చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసిన నిధులు వెనక్కి పోయే అవకాశం ఉందన్నారు.
జిల్లాలో రైతులు భూసార పరీక్షలు చేయించుకునే విధంగా వారికి అవగాహన కల్పించి వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని ఎలాంటి పంటలు వేసుకోవాలన్న అంశాలపై రైతులను ప్రోత్సహించాలన్నారు. భూసార పరీక్ష కేంద్రాలకు సంబంధించి నంద్యాలలో మాత్రమే పని చేయడం జరుగుతోందని, పనిచేయని వాటికి ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుండి రైతులకు ఆర్థిక సహాయం జరుగుతోందన్నారు.
జిల్లాలో దిగుబడి ఆధారిత 10 పంటలు, వాతావరణ ఆధారిత 4 పంటలు వేయడం జరుగుతోందన్నారు. రబీ, ఖరీఫ్ సీజన్ లో పంట భీమా పండించే పంటలకు తప్పనిసరిగా పంట భీమా కల్పించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా జిల్లాలో ఎక్కువ శాతం కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు మరింత లబ్ది పొందే అవకాశం ఉంటుందన్నారు. పశు సంవర్థక శాఖకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 57,392 పాడిపశువులు రైతుల వద్ద ఉన్నాయని, వాటిని పెంచడానికి పశువులు లేని వారికి పశువులు ఇచ్చి ప్రోత్సహించామని కలెక్టర్ తెలిపారు.
జలకనూరు రిజర్వాయర్ నుండి ఎటువంటి అనుమతలు లేకుండా విద్యుత్ కనెక్షన్ల ద్వారా నీటిని తీసుకుంటున్నారని అలాంటి కనెక్షన్లు ఉంటే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. కుందూ నది పాతవంతెన పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని అందుకు బీటీ రోడ్డు, ఇరువైపులా రైలింగ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా కొత్త వంతెన నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు చేపట్టడం జరిగిందని అందుకు సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందన్నారు.
ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ…. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ 340సి కు సంబంధించిన పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. అదే విధంగా అండర్ పాత్ నిర్మాణాలు చాలా దూరంగా వేయడం ద్వారా గ్రామస్థులు రోడ్డు దాటడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ (JMVP) జిల్లాను పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని, శ్రీశైలానికి వెళ్లడానికి సింగిల్ రోడ్డు మార్గం ఉండడం వల్ల అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని, అలా కాకుండా జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ (JMVP) ద్వారా సంగమేశ్వరం నుండి శ్రీశైలం వరకు బోటు మార్గం ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా పర్యాటకపరంగా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని దిశా కమిటీ ఛైర్మన్/నంద్యాల పార్లమెంటు సభ్యులకు, జిల్లా కలెక్టర్ కు వివరించారు.
Arattai