NANDYAL May23 :- నంద్యాల ఆటోనగర్ అభివృద్ధికి మరియు రాత్రింబవళ్లు కష్టపడే ఆటోనగర్ కార్మికుల సంక్షేమానికి తాము రాజకీయాలకు అతీతంగా కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. శనివారం నంద్యాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆటోనగర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, సమాజంలో ఆటోనగర్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని, వారి శ్రమను గుర్తించి ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటోనగర్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ. 10 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశామని, ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని మరియు సంబంధిత మంత్రులను కలిసి నిధుల కొరకు చర్చించినట్లు తెలిపారు. గతంలో ఆటోనగర్ కార్మికులకు కేటాయించిన స్థలాల విషయంలో పెరిగిన ప్రస్తుత మార్కెట్ ధరలను (మార్కెట్ వాల్యూ) పరిగణనలోకి తీసుకుని, కార్మికులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అందరికీ న్యాయం జరిగేలా చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. ఆటోనగర్ కు అనుకూలంగా ఉండేలా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, ఇతర కనీస సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు.

తాము ఎప్పుడూ ఆటోనగర్ కార్మికుల సంక్షేమం విషయంలో రాజకీయం చేయలేదని, కేవలం కార్మికులకు మేలు చేయడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఆటోనగర్ ఏర్పాటు చేసేటప్పుడు ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు ఎవరు అప్పుడు రాజకీయాల్లో లేరని ఇది వారు గమనించాలన్నారు . ఆటోనగర్ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆటోనగర్ ని అభివృద్ధి చేశానని తెలిపారు ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నామని ఆటోనగర్ పై ఇతరులు జోర్గం చేసుకుంటే సహించ ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వాల కంటే మిన్నగా కార్మికుల ప్రయోజనాలను కాపాడతామని భరోసా ఇచ్చారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai