ఆయుర్వేద ఔషధాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలి
NANDYAL Oct 19:- మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం ధన్వంతరి జయంతి మరియు దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
శ్రీ ధన్వంతరి గురించి,దీపావళి విశిష్టత గురించి ప్రధాన వక్త,దంత వైద్యులు డా”కె.కిశోర్ కుమార్ గారు మాట్లాడుతూ బ్రిటీష్ వారు రాక ముందు భారతదేశంలో ఆయుర్వేద వైద్యం ఎక్కువ ప్రాచుర్యం పొందిందని తెలిపారు.

వంటింటి పసుపు మొదలు పెరటి మొక్కల వరుకు ఔషధం విలువలు కలిగినవని,కలబంద, తులసి, పచ్చకర్పూరం, పారిజాతం పూలు వంటి మన పరిసర మొక్కలు అవసరాన్ని బట్టి మనం ఆయుర్వేద ఔషధాలుగా ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.సుశ్రుతుడు,చరకుడు, చ్యవనుడు ఎన్నో మూలికలతో పూర్వం చికిత్సలందించారని, సుశ్రుతుడు ప్రపంచంలోనే తొలి శస్త్ర చికిత్స నిపుణులుగా పేరు గాంచారని, సుశ్రుత సంహిత పుస్తకం ద్వారా వారు ఎంతో విలువైన సమాచారం అందించారన్నారు.అలాగే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనం, చీకటి నుండి వెలుతురు తోవలోకి వెళ్ళడం దీపావళి పరమార్థం అని వివరించారు.
కేశవ మూర్తి మాట్లాడుతూ క్షీరసాగర మథనంలో అమృత భాండంతో శ్రీ ధన్వంతరి ఉద్భవించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయన్నారు.దేవ వైద్యుడిగా ధన్వంతరికి పేరుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ మాజీ గవర్నర్ చిన్నపరెడ్డి మాజీ అధ్యక్షులు డివి సుబ్బయ్య, కాల్వ నాగరాజు, అన్నెం శ్రీనివాసరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply