NANDYAL Oct 23 :-మహానంది మండలంలో పైలట్ ప్రాతిపదికన జరగనున్న జనాభా లెక్కల (Census) ప్రీ-టెస్ట్ కార్యకలాపాలు ఖచ్చితత్వంతో, సమయపాలనతో సాగేందుకు సంపూర్ణ శిక్షణతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 2027 జనాభా లెక్కల ముందస్తు సెన్సిటైజేషన్ కార్యక్రమాలపై నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా సమావేశంలో కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాబోయే 2027 జనాభా లెక్కల ప్రీ-టెస్ట్ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యమైనవని, సెన్సస్ ప్రక్రియలో ఎన్యుమరేటర్‌లు, సూపర్వైజర్‌లు సంపూర్ణ శిక్షణ పొంది ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ పనిని సమయపాలనతో, నిర్దిష్ట విధానంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించి పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారు. వచ్చే నెల 10 నుండి 30 వరకు మొదటి దశగా ఇళ్ల జాబితా మరియు ప్రాథమిక సర్వే నిర్వహించనున్నట్లు తెలియజేసి, ఈ దశకు అవసరమైన డిజిటల్ అసిస్టెంట్లకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సుప్రజ్, జిల్లా గణాంక అధికారి పోతల మోహనరమణ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ మాధురి పాల్గొని సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రీ-టెస్ట్ కార్యకలాపాల లక్ష్యాలు, విధానాలు, సమయపాలన, మరియు డేటా సేకరణలో అనుసరించాల్సిన ప్రమాణాలపై సవివరంగా చర్చించారు. గణాంక అధికారి పోతల మోహనరమణ మాట్లాడుతూ, సెన్సస్ కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనున్నాయని, అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు, డేటా ఎంట్రీ టూల్స్ వినియోగంపై అధికారులు, డీలింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించామని తెలిపారు. రాబోయే ప్రధాన జనాభా లెక్కల 2027 సన్నాహక దశలో ఈ ప్రీ-టెస్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
జిల్లాలో జనాభా లెక్కల ముందస్తు పరీక్ష కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సమన్వయం, శిక్షణ, క్షేత్ర స్థాయి వ్యూహాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశం చివర్లో జిల్లా అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించి, క్షేత్రస్థాయి అమలు పద్ధతులు, సాంకేతిక సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు.
📖 Also Available as Web Story
Experience this content as an engaging Web Story - perfect for mobile reading!
🎬 View Web Story


Arattai



Leave a Reply