NANDYAL Oct27 :-“మొంథా” తుఫాను ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో తుఫాన్ ప్రభావ భద్రతా చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. కార్తిక్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ మొంథా తుఫాను కాకినాడ–విశాఖపట్నం మధ్య తీరం దాటుతుందని, దాని ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నంద్యాల జిల్లాపైనా ఉండే అవకాశముందని అన్నారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలోని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఉల్లి, మొక్కజొన్న, టమోటా రైతులు పంట కోతను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 30 శాతం మొక్కజొన్న కోత జరగగా, అధిక తేమ కారణంగా పంటలకు తక్కువ ధరలు పడే అవకాశం ఉందని, వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పంటలను కొనుగోలు చేయాలని సూచించారు.

రైతులకు పంట కోత వాయిదా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, ముఖ్యంగా ఆత్మకూరు పట్టణంలో నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆమె మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు మాత్రమే అందేలా చర్యలు చేపట్టాలని, అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని ఆమె సూచించారు. అదే విధంగా ఆర్ఓ ప్లాంట్లలో క్లోరినేషన్ నిర్వహించడమే కాకుండా ఫిల్టర్ మెంబ్రేన్లను శుభ్రపరచాలని, నాణ్యత ప్రమాణాలు పాటించని ప్లాంట్లను సీజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వర్షాల ప్రభావంతో ప్రమాదావస్థలో ఉన్న మట్టి మిద్దెల్లో నివసించే ప్రజలకు నోటీసులు జారీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అదే విధంగా కెనాల్స్, చెరువుల వద్ద గండి పడిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఇసుక సంచులు వంటి అవసరమైన సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, అధిక వర్షపాతం నమోదైతే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఆధార్ అప్డేట్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు ఆధార్ వివరాలు సరిచేయని వారు తప్పనిసరిగా బయోమెట్రిక్, చిరునామా తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఈ-కెవైసీ పూర్తి చేసి ప్రభుత్వ లబ్ది పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
రైతులు ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలని, వర్షాల వల్ల నష్టపోయే పంటలపై ఈ-క్రాప్ నమోదు ఆధారంగా నష్టపరిహారం అంచనా వేయగలమని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా విద్యార్థులకు జారీ చేసే అపార్ ఐడీలు కూడా ఈ క్యాంపుల్లో పొందేలా అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
Arattai