NANDYAL Oct29 :-మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితిని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కుందు నది పరివాహక ప్రాంతం (నందమూరి నగర్ వైపు రోడ్), వైయస్సార్ నగర్, పెద్దకొట్టాల, శ్యాం నగర్ చామకాలువ, శ్రమదానం బ్రిడ్జి, ఎస్బిఐ కాలనీ (రామకృష్ణ పిజి కాలేజ్ సమీపం) వంటి ప్రాంతాల్లో పర్యటించి వరద నీటి ప్రవాహం, కాలువల సామర్థ్యం, మరియు నివారణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి, కలెక్టర్ ల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు

ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. ప్రస్తుతం కుందు నది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో అనవసరంగా సంచరించరాదని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

జిల్లాలో తుఫాను పరిస్థితిపై కలెక్టర్ వివరణ
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మొంథా తుఫాను ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుండి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయన్నారు. జిల్లాలో సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లు కాగా శ్రీశైలం మండలంలో 26 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో 10 సెంటీమీటర్లకు మించిన వర్షపాతం నమోదైన మండలాలు మొత్తం 10 ఉన్నాయన్నారు. ముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు నియోజకవర్గాలు ఈ భారీ వర్షాలకు ఎక్కువగా ప్రభావితమయ్యాయని కలెక్టర్ తెలిపారు.

వెలుగోడు రిజర్వాయర్‌కు సరైన పరిపుష్టి లేకపోవడంతో దిగువకు సుమారు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల కుందు నదిలో ప్రవాహం పెరిగిందన్నారు. అయితే నీటిని నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. నంద్యాల అర్బన్ ప్రాంతంలో మొత్తం ఆరు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో సుమారు 1,400 కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరి ఇళ్లలోకి నీరు చేరిందో వారిని సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనం, వసతి వంటి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు

రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల సహకారంతో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పంపిస్తున్నామని వివరించారు. అలాగే పంట నష్టం మరియు ఇతర నష్టాల అంచనా వేయడం జరుగుతోందని, గురువారం సాయంత్రం నాటికి పంట పొలాల్లోని నీరు తగ్గిన తర్వాత స్పష్టమైన వివరాలు లభించే అవకాశం ఉందన్నారు.

రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మొంథా తుఫాను కారణంగా ప్రతి జిల్లాలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎదురయ్యే ఏ సమస్యలనైనా ప్రభుత్వానికి వెంటనే నివేదించడం జరుగుతోందని, ముఖ్యంగా మొక్కజొన్న, వరి, మిరప, ఉల్లి, పూల వంటి పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం నుండి తగిన సహాయం అందించబడుతుందని కలెక్టర్ చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా నల్లమల్ల ప్రాంతంలో కురిసిన వర్షాలు 21 వాగుల్లో ప్రవహించి కుందు నదిలో కలిశాయని తెలిపారు. దాంతో బండి ఆత్మకూరు మండలం నారాయణపురం, ఆత్మకూరు మండలంలోని భవనాసి వాగు పొంగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు మండలాలు, మహానంది మండలం నందిపల్లి, నంద్యాల అర్బన్ ప్రాంతాల్లో మొత్తం ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

వర్ష సూచన ప్రస్తుతం లేకపోవడంతో ఉప్పొంగిన వాగులు, రోడ్లమీద ప్రవహిస్తున్న నీరు తగ్గే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం, ఆత్మకూరు ప్రాంతాల్లో మాత్రమే వర్ష సూచన ఉన్నదని, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల ఆర్డిఓ విశ్వనాథ్ ఇతర అధికారులు వారి వెంట పాల్గొన్నారు.

Arattai