నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో,నంద్యాల క్రిస్టియన్ వైద్యుల నిర్వహణలో స్థానిక మధుమణి సమావేశ భవనంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ కె.ఈ.పి. వీ. రాజశేఖర్, సభ్యులు డాక్టర్ ఫ్రాంక్ మోహన్, డాక్టర్ కిషోర్ నిర్వహణలో జరిగిన ఈ ఉత్సవాలకు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్యఅతిథిగా, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ గౌరవ అతిథిగా హాజరయ్యారు.

ముందుగా డాక్టర్ రూఫస్, డాక్టర్ ప్రవీణ్,డాక్టర్ మోనాలిసా వాద్య సంగీత బృందం సహకారంతో ఆలపించిన క్రిస్మస్ కరోల్స్ పాటలు ఆహుతలను అలరించాయి.

కర్నూలుకు చెందిన ప్రముఖ యూరాలజీ వైద్యులు డాక్టర్ ఆండ్రూస్ జేసుదాస్ ప్రధాన వక్తగా పాల్గొని క్రిస్మస్ పర్వదిన సందేశాన్ని అందించారు. ఆండ్రూస్ జేసుదాస్ మాట్లాడుతూ మానవ లోకాన్ని రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారని,మానవాళిని కాపాడడం కోసం సిలువ వేయబడి రక్తం చిందించారని, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయపడే గుణం అలవర్చుకోవాలని అన్నారు.ఎన్.ఎం.డి.ఫిరోజ్,డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ రాజశేఖర్ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని మతాలను పరస్పరం గౌరవించడం అవసరమన్నారు. తమ తండ్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో మతసామరస్యం నెలకొల్పడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు.క్రీస్తు ప్రేమ తత్వాన్ని, క్షమాగుణాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని, క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం ఆనందదాయకం అన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ నంద్యాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. సంక్రాంతి వేడుకలు,రంజాన్ ఇఫ్తార్, క్రిస్మస్ ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం మతాల మధ్య ఐకమత్యానికి దోహదం చేస్తుందని అన్నారు.

మీ శత్రువులను కూడా ప్రేమించండి,నిన్ను ద్వేషించు వారి కొరకు ప్రార్థించండి అన్న అత్యున్నత విలువలు జీసస్ ప్రబోధించారని అన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రాజశేఖర్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ,డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ వసుధ, డాక్టర్ మాధవి ప్రసంగించారు.

వేడుకలలో ముగింపుగా అతిధులు, ఆహుతులు కొవ్వొత్తులు వెలిగించి, క్రిస్మస్ గీతాల నేపథ్యంలో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల తరఫున ఎన్ఎండి ఫిరోజ్, ప్రధాన వక్త డాక్టర్ ఆండ్రూస్ జేసుదాస్,డాక్టర్ రాజశేఖర్,డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాణి ప్రమీల లను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల క్రిస్టియన్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్,డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాణి ప్రమీల, డాక్టర్ రూఫస్, డాక్టర్ కిషోర్, డాక్టర్ ఎస్తేర్ వందన, డాక్టర్ ఫ్రాంక్ మోహన్, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మోనాలిసా,నంద్యాల ఐఎంఏ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Arattai