ALLAGADDA Dec 16:- రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా అన్ని పాఠ్యాంశాలలో పూర్తి స్థాయి శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఉపాధ్యాయులను ఆదేశించారు.

మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, బోధనా విధానం, విద్యార్థుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించిన కలెక్టర్, కొంతమంది విద్యార్థులు తరచుగా పాఠశాలకు హాజరు కావడం లేదని గమనించారు. ఇందుకు గల కారణాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు నిరంతరం పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు, విద్యార్థులను ప్రోత్సహించి చదువుపై ఆసక్తి పెంచాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన చోట ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులను ముందుకు తీసుకురావాలన్నారు.

అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్, పాఠ్యాంశాలు పూర్తయ్యాయా, రివిజన్ ఎంతవరకు జరిగింది అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. అన్ని విషయాల్లో సమగ్ర అవగాహన కల్పిస్తూ పునశ్చరణ తరగతులు నిర్వహించి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన దశ అని పేర్కొన్న కలెక్టర్, విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Arattai