NANDYAL :- ఆసుపత్రి పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.గురువారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ సానుకూల ప్రజా దృక్పథం, సీజనల్ వ్యాధులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రాధాన్యత అంశాలు, వరి సేకరణ, ఎరువుల సరఫరా, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, డిఆర్ఓ రాము నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసి అధిక నిధులు ఖర్చు చేస్తోందని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలందించాలన్నారు.

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.జిల్లాలో మలేరియా డెంగు వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులకు వివరించి దిశ నిర్దేశం చేశారు.
Arattai