NANDYAL Dec26:-నంద్యాల నియోజకవర్గం, గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో రూ.5.33 కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా. బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నాబార్డ్ నిధులు రూ.5.33 కోట్లతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఒక్క నంద్యాల జిల్లాలోనే రూ.150 నుంచి రూ.160 కోట్ల వ్యయంతో హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుతుందనే భ్రమలో ప్రజలు ఉండవద్దని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నేడు అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన వైద్యులతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆసుపత్రులకు శంకుస్థాపనలు చేసి, నిర్మాణాలపై గొప్పలు చెప్పుకున్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారని తెలిపారు. యాళ్లూరు గ్రామంలో ఆసుపత్రి నిర్మాణానికి స్థలం అందించిన దాతలకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉన్న యాళ్లూరులో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గతంలో అత్యవసర వైద్య సేవల కోసం నంద్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ అవసరం తగ్గుతుందని అన్నారు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజలు ఆహార నియమాలతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రూ.5.33 కోట్లతో అధునాతన వైద్య పరికరాలతో కూడిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభించామని తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్ సర్వీసెస్, ఫిజియోథెరపీ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), 19 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీలు), 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 2 ఏరియా ఆసుపత్రులు ప్రజలకు సేవలందిస్తున్నాయని వివరించారు. ఆధునిక జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ సామర్థ్యం పెంపు అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ లలిత, హెచ్డీఎస్సీ సభ్యుడు వెంకట్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డా. శ్రీరామ్ కుమార్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Arattai