NANDYAL Dec26:- బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం పది మందికి మించి కార్మికులు పనిచేస్తున్న ప్రతి భవన నిర్మాణ పనిస్థలంలో పనిచేసే కార్మికులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం–1996, సెస్ నియమాలు–1998పై జిల్లా స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ బషీరున్నిసా బేగం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, బిల్డింగ్ యాక్ట్ చట్టం ప్రకారం పది మందికి మించి కార్మికులు పనిచేసే ప్రతి నిర్మాణ పనిస్థలాన్ని తప్పనిసరిగా ‘మీ సేవ’ ద్వారా నమోదు చేయించాలని ఆదేశించారు. భవన నిర్మాణ సెస్ వసూలు విషయంలో ప్రతి నెల 10వ తేదీ లోగా సెస్ జమ అయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. జనవరి 1 నుంచి నవంబర్ వరకు ఇప్పటివరకు పబ్లిక్ నిర్మాణాల నుంచి రూ.9,21,72,426/- మరియు ప్రైవేట్ నిర్మాణాల నుంచి రూ.1,96,77,308/- సెస్ వసూలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అదేవిధంగా 20 మందికి మించి కార్మికులు పనిచేస్తున్న ప్రతి సంస్థలో కార్మికులందరూ ఈపీఎఫ్ఓ (EPFO)లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఇది అత్యంత అవసరమని పేర్కొన్నారు.బాల కార్మికుల చట్టంపై మాట్లాడుతూ, హానికరం కాని కర్మాగారాల్లో 14 సంవత్సరాల లోపు, ప్రమాదకరమైన కర్మాగారాల్లో 18 సంవత్సరాల లోపు బాల కార్మికులు పనిచేయకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించిన పక్షంలో టోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం ఇస్తే తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికుల చట్టాల ప్రకారం కార్మికులకు కనీస వేతనం, భద్రతా ప్రమాణాలు, సంక్షేమ సౌకర్యాలు తప్పనిసరిగా అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డిటిఓ లక్ష్మీదేవి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ఆ ఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, కార్మిక శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Arattai