NANDYAL JAN2:- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం (పబ్లిక్ పర్ పబ్లిక్ పర్సెప్షన్) ఈ నెలలో 80 శాతానికి పైగా ఉండేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రజా సానుకూల అవగాహన పెంపు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, రైల్వే లెవల్ క్రాసింగ్స్ సమస్యలు, ఏజెంట్ స్పేస్‌కు సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్స్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నంద్యాల కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌తో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా చేసి, ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచడం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ నెలలో ప్రజల సంతృప్తి 80 శాతానికి పైగా నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన చర్యలు చేపడతామని తెలిపారు. పబ్లిక్ పర్సెప్షన్ మెరుగుపర్చే చర్యల్లో భాగంగా, బేతంచర్ల మండలంలోని మద్దిలేటి స్వామి దేవస్థానాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించి, సౌకర్యవంతమైన దైవ దర్శనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అదే విధంగా ప్రసాద నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా భక్తుల ప్రమాణాలకు అనుగుణంగా అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ఎఫ్ – లైన్ పిటిషన్ల పరిష్కారంలో డిజిటల్ అసిస్టెంట్లకు మరింత అవగాహన కల్పించి, ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచించిన మార్గదర్శకాలను జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు కట్టుబడి అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

Arattai