NANDYAL Dec15 :- తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ధృఢ సంకల్పంతో సుదీర్ఘ పోరాటం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేట్ వద్ద నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. స్వార్థం లేని సేవాభావంతో, దేశభక్తితో ఆయన చేసిన త్యాగం నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు. పొట్టి శ్రీరాములు గారు కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ఆత్మార్పణతో నాంది పలికారని మంత్రి పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలో ఒక భాషా సమూహం కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయనేనని గుర్తు చేశారు. శ్రీరాములు గారి దీక్ష, త్యాగాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం స్పందించి, తెలుగు మాట్లాడే ప్రజల కోసం దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని మంత్రి వివరించారు. ఈ చారిత్రక సంఘటన దేశవ్యాప్తంగా ఇతర భాషా సమూహాలకు కూడా స్ఫూర్తినిచ్చి, రాష్ట్రాల పునర్విభజనకు దారి తీసిందన్నారు.

తెలుగు భాష, సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పొట్టి శ్రీరాములు గారు చేసిన మహోన్నత త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అహింస, సేవ, సత్యం, సామాజిక న్యాయం వంటి విలువలతో ఆమరణ నిరాహార దీక్ష చేసి, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారని అన్నారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఫలితంగానే 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.
వారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అన్వయించుకుని, ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో పొట్టి శ్రీరాములు గారి త్యాగం సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, సమష్టిగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, తాసిల్దార్ శ్రీవాణి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Arattai