NANDYAL Jan31:- ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్,ఆంధ్ర చెస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో,నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఫిబ్రవరి 21,22వ తేదీలలో నంద్యాల ఎస్.బి.ఐ కాలనీలో ఉన్న శ్రీ రామకృష్ణ డిగ్రీ,పీజీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫీడే రేటింగ్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీ వివరాలతో కూడిన పోస్టర్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ నంద్యాలలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డా.జి.రవికృష్ణ,కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ చదరంగం క్రీడ పట్ల బాలలలో ఇటీవల ఆసక్తి పెరిగిందని అన్నారు.నంద్యాలలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఫీడే రేటింగ్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం చదరంగం క్రీడ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రథమ బహుమతి 30 వేల రూపాయలు,ద్వితీయ బహుమతి 20 వేల రూపాయలు,తృతీయ బహుమతి 15 వేల రూపాయలు కలిపి మొత్తం మూడు లక్షల రూపాయల నగదు బహుమతులతో పాటు వివిధ విభాగాలలో విజేతలకు ట్రోఫీలను, పతకాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపు పాల్గొనదలచిన క్రీడాకారులు www.apchess.org లో పేర్లు నమోదు చేసుకోవల్సి ఉంటుందని,అంతర్జాతీయ ఫిడే రేటింగ్ మెరుగుపరచుకోవడానికి, రేటింగ్ లేని క్రీడాకారులు కొత్తగా రేటింగ్ తెచ్చుకోవడానికి ఈ టోర్నమెంట్ ఉపకరిస్తుందని అన్నారు. ఈ సదవకాశాన్ని చెస్ క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు.
జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సభ్యత్వం కలిగి ఉండాలని,సభ్యత్వం ఉన్నవారు 2025-26 వ సంవత్సరానికి సభ్యత్వం రెన్యువల్ చేసుకోవలసి ఉంటుందని తెలిపారు.కొత్తగా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సభ్యత్వం చేసుకోవాలనుకునే వారు బాలాజీ కాంప్లెక్స్ లోని కళారాధన కార్యాలయం పై అంతస్తులు ఉన్న చెస్ అకాడమీలో సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో సంప్రదించాలని సూచించారు.
ఇతర వివరాలను 9010451585 ఫోన్ నెంబర్ లో తెలుసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, ఎన్.ఆర్.జి.చెస్ అకాడమీ ఉపాధ్యక్షులు జనార్ధన రెడ్డి పాల్గొన్నారు.
Arattai