NANDYAL Feb11:- సికింద్రాబాద్ బొల్లారం ఫుట్ బాల్ గ్రౌండ్ లో తెలంగాణ బాక్సింగ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో నంద్యాల జిల్లా క్రీడాకారులు పాల్గొని 15 పతకాలు సాధించారు.
వీరు అవుకు మదర్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన విద్యార్థులు.జూనియర్ విభాగాలలో వివిధ వెయిట్ కేటగిరీలలో జయశ్రీ ,యశ్వంత్ నాయక్, చంద్రకాంత్ ఆచారి, నంద సాత్విక్ రెడ్డి, దీపిక, లక్ష్మీ షర్మిల ,జ్ఞాన ప్రసన్న స్వర్ణ పతకాలు సాధించగా, తపస్వి భాయ్ ,సుశాంత్,పూజిత రజత పతకాలు, వైష్ణవి, మణి చరణ్, ధీరజ్ ,లక్ష్మణ్, హరిప్రియ లు కాంస్య పతకాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి, రాష్ట్ర సంఘం కార్యవర్గ సభ్యుడు ఫయాజ్ ఆధ్వర్యంలో మధుమణి సమావేశ భవనంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జి. రవికృష్ణ, కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అతిథులుగా పాల్గొని విజేతలను,కోచ్ లు ఫయాజ్, చంద్ర, ప్రసాద్,మదర్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు మురళీమోహన్ లను శాలువ లతో సత్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాలలో బాక్సింగ్ క్రీడ అభివృద్ధి కోసం సహకరిస్తామని, క్రీడలలో రాష్ట్ర ,జాతీయ స్థాయిలో రాణించిన నంద్యాల జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించి సహకారం అందజేస్తామన్నారు.
డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో పాల్గొనడం చాలా అవసరమని,తద్వారా మానసిక వికాసం,శారీరక దారుఢ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, విద్యార్థులను క్రీడలలో, కళలలో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఫయాజ్, కోచ్ లు చంద్ర, ప్రసాద్, మదర్ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మురళీమోహన్, క్రీడాకారులు పాల్గొన్నారు
Arattai