NANDYAL April13:-జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి జవాబుదారీగా పనిచేస్తూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ముందు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో పరిష్కరించిన కొన్ని గ్రీవెన్సులు మళ్లీ రీఓపెన్ అవుతున్నాయని, అలాంటి కేసులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన 17 మంది అధికారులతో తాను సమీక్షిస్తానని తప్పనిసరిగా సంబంధిత పత్రాలతో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత కోసం అధికారుల సమక్షంలోనే ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి అభిప్రాయాలను నమోదు చేసి సీఎం కార్యాలయానికి నివేదిక పంపుతామని తెలిపారు.

ప్రతి వారం జరిగే సమీక్షలకు ముందు 100 శాతం ఫిర్యాదుల పరిష్కారం జరగాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. పీజీఆర్ఎస్ నివేదికలపై ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత వివరాలను నిర్దేశిత సమయంలో గా సమర్పించాలన్నారు. ఫిర్యాదుదారులకు ఎండార్స్మెంట్ ఇవ్వడం లేదా వారి వద్దకు వెళ్లి పరిష్కారం నమోదు చేయడం తప్పనిసరి అని తెలిపారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రభుత్వ కార్యక్రమాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా ఐగాట్ “4-అవర్ లెర్నింగ్” కార్యక్రమాన్ని పూర్తి చేసి వెంటనే సర్టిఫికెట్లు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల హాజరు, పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం సహించబోమని సూచించారు. పనితీరు ఆధారంగా మార్కులు ప్రకటిస్తామని తెలిపారు. అలాగే, కేపీఐల నమోదు, శిక్షణా కార్యక్రమాలు, సర్ప్రైజ్ తనిఖీలు, షోకాజ్ నోటీసుల జారీ వంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సెన్సస్ శిక్షణను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఇటీవల బేతంచెర్ల మండలంలోని ఆర్. కృష్ణాపురం గ్రామ సచివాలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు తెలిపారు. కొన్ని శాఖల సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని, హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్త బురుజు గ్రామ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల పనులను వేగవంతం పూర్తి చేయాలని సూచించారు.

విద్యుత్ సదుపాయాల కల్పనలో జరుగుతున్న ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సంబంధిత శాఖలు సమన్వయంతో పని పెంచాలని ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేకు వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నందున, క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, జలధార–జలహారతి కార్యక్రమాలపై నిరంతర సమీక్ష ఉంటుందని, కె.సి కాలువ మరియు తెలుగు గంగ పనులను వేగవంతం చేయాలని, అవసరమైతే ఇతర పథకాల కింద కూడా పనులు చేపట్టాలని సూచించారు.
Arattai