NANDYAL May01 :- నంద్యాల పట్టణంలోని తెలుగుతల్లి ఉద్యానవనంలో గౌతమబుద్ధుని జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుందూ సాహితీ సమితి అధ్యక్షులు,రచయిత డా.కురుమేటి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు సాహితీవేత్తలు ఉద్యానవనంలోని బుద్ధుని ప్రతిమకు పుష్పాంజలులు ఘటించారు. శాంతి, అహింస,దయ అనే మహోన్నత సందేశాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుని జయంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యఅతిథి సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు మాట్లాడుతూ బుద్ధుని జీవితం ఒక మహాకావ్యమని ఆయన బోధనలు సమాజంలో నైతికవిలువలు నిలబెట్టడానికి దోహదపడతాయన్నారు. అధ్యాపకులు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ బుద్ధుడు తెలియజేసిన అహింసామార్గం,సహనం,సమానత్వం వంటి విలువలు ఉత్తమ సమాజ భవిష్యత్తుకు దోహదపడతాయన్నారు.
కార్యక్రమంలో మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, సాహితీ స్రవంతి కార్యదర్శి డా.నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బుద్ధుడు సూచించిన ధర్మమార్గం,సిద్ధాంతాలు సమాజశాంతికి బాటలు వేస్తాయన్నారు. సాహితీవేత్తలు నరేంద్ర, డా.బాలరాజు,శేషఫణి బుద్ధుని జీవితవిశేషాలపై కవితలు వినిపించారు. కార్యక్రమంలో డా.రామచంద్రారెడ్డి, నరేంద్రనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు..
Arattai