NANDYAL May27 :- నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం ఉమాపతి నగరానికి చెందిన రైతు గడ్డిపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో “సృష్టి రైతు సమూహం” ద్వారా ఏర్పాటు చేసిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి రాజశేఖర్ కలెక్టర్‌కు వివరాలు తెలియజేస్తూ, రైతులకు విత్తనాలు అందజేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన మిల్లెట్స్‌ను తిరిగి కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు, వరిగలు వంటి చిరుధాన్యాలను బియ్యంగా మార్చడంతో పాటు సజ్జలు, రాగులు, జొన్నలను శుభ్రపరిచి ప్యాకింగ్ చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు కలెక్టర్ కు నివేదించారు. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు.

యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్ రాజకుమారి స్వయంగా మిషన్ ప్రారంభించి ముడి సరుకు నుంచి బియ్యం, నూకలు ఎలా తయారవుతున్నాయో ప్రాసెస్‌ను పరిశీలించారు. అక్కడ తయారు చేసిన మిల్లెట్ స్నాక్స్‌ను రుచి చూసి వాటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు రవ్వ తయారీ మిషన్ మరియు సార్టెక్స్ మిషన్ కొనుగోలుకు ఆర్థిక సహాయం లేదా సబ్సిడీ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ విషయంపై స్పందించిన కలెక్టర్, రూ.50 లక్షల వరకు ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయని, సంబంధిత వివరాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి యూనిట్ జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్, ఉద్యమ్ ఆధార్, అవసరమైన యంత్రాల అంచనా వ్యయ వివరాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలని కలెక్టర్ సూచించారు. మిషనరీ కొనుగోలుకు సుమారు రూ.26 లక్షలు అవసరమవుతాయని, ప్రస్తుతం ముడి సరుకు కొనుగోలుకు వర్కింగ్ క్యాపిటల్ కొరత ప్రధాన సమస్యగా ఉందని సంఘ ప్రతినిధి సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు సమూహాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
Arattai