NANDYAL June22 :- దేశంలో పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలన సాధించినప్పటికీ, పొరుగు దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వ్యాధి తిరిగి వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల స్వీకరణ అనంతరం పల్స్ పోలియో కార్యక్రమం, డయేరియా నివారణ చర్యలు, వర్షాకాలంలో తలెత్తే అంటువ్యాధుల నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో వంద శాతం విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం దేశం పోలియో రహితంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నందున ప్రతి సంవత్సరం ప్రత్యేక రక్షణ చర్యగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 28వ తేదీ ఆదివారం మొదటి రోజు పోలియో బూత్ల ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని, అదే రోజున 90 నుంచి 95 శాతం మంది పిల్లలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 29, 30 తేదీలలో ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో జననం నుండి ఐదేళ్లలోపు వయస్సు కలిగిన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమం కోసం దాదాపు మూడు లక్షల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తున్నామని, వ్యాక్సిన్ నాణ్యత దెబ్బతినకుండా కోల్డ్ చైన్ వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం మెడికల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, సూపర్వైజర్లతో మండల, గ్రామ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి తగిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్య, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖలను భాగస్వామ్యం చేసి వంద శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 1320 పోలియో బూత్లు, 44 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 4 వేల మంది సిబ్బందికి శిక్షణ అందించామని, వలస కూలీలు నివసించే ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రదేశాలు, ఫ్యాక్టరీలు, పట్టణ మురికివాడలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ పిల్లలు ఎవరూ మిస్ కాకుండా మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల పిల్లలకు కూడా పోలియో చుక్కలు అందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల నోటీస్ బోర్డులు, గ్రామ సభలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పోలియో కార్యక్రమంలో నమోదయ్యే వివరాలను వెంటనే యాప్లో నమోదు చేస్తూ రియల్ టైమ్ డేటా అప్డేషన్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పని చేయడమే కాకుండా రికార్డులను కూడా సకాలంలో నవీకరించడం ద్వారా ఖచ్చితమైన కవరేజ్ శాతం తెలుసుకోవచ్చని, మిగిలిన పిల్లలను ప్రత్యేక మాప్-అప్ రౌండ్ల ద్వారా కవర్ చేయవచ్చని తెలిపారు.
డయేరియా,డెంగ్యూ,మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డయేరియా నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో డైరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, ఓఆర్ఎస్ కార్నర్ల ఏర్పాటు, ఇంటి వద్దే ఓఆర్ఎస్ ద్రావణం తయారీపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించిన వెంటనే పిల్లలకు ఓఆర్ఎస్ అందించి అవసరమైతే ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. తాగునీటి పైప్లైన్లలో లీకేజీలు, డ్రైనేజీ సమస్యలను వెంటనే గుర్తించి సరిచేయాలని, కలుషిత నీటి వల్ల వ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బహిరంగ మలవిసర్జన నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల కారణంగా దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణకు విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. అవసరమైన చోట ఫాగింగ్, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్ చేపట్టి దోమల పెరుగుదలను అరికట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా కలుషితమైన లేదా నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వినియోగం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. జిల్లాలో పోలియో, డయేరియా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా కలుషితమైన లేదా నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వినియోగం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. జిల్లాలో పోలియో, డయేరియా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. అనంతరం పోలియో నివారణ గోడపత్రికను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ సంబంధిత వైద్య అధికారులు ఆవిష్కరించారు.
Arattai