అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Aug10 :- జిల్లాలో అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, మరింత మంది అవయవ దానానికి ముందుకు వచ్చేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. పీజీఆర్ఎస్ హాల్ ముందు ఏర్పాటు చేసిన ‘ఐ సపోర్ట్ ఆర్గాన్ డొనేషన్’ సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్ ఫొటో దిగి, అవయవ దానానికి అంగీకారం తెలుపుతూ దరఖాస్తును పూరించి రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా అవయవ దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు ఏర్పాటు చేసిన అవగాహన సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “అవయవ దానం కేవలం ఒక వైద్య ప్రక్రియ కాదు.. మరణానంతరం కూడా మరొకరి జీవితానికి ఆశను అందించే మహోన్నత సేవ. ఒకరి అవయవ దానం మరొక కుటుంబంలో వెలుగులు నింపగలదు” అని అన్నారు. మరణానంతరం శరీరం మట్టిలో కలిసిపోయే బదులు, అవయవ దానం ద్వారా పలువురికి జీవనాన్ని అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా ఎనిమిది మంది వరకు ప్రాణాలను కాపాడే అవకాశం ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. అవయవ దానంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకార పత్రాన్ని పూరించి తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు, ‘ఐ సపోర్ట్ ఆర్గాన్ డొనేషన్’ సెల్ఫీ పాయింట్ వద్ద తమ మద్దతును తెలియజేయాలని కలెక్టర్ కోరారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పీజీఆర్ఎస్ హాల్ వద్ద ప్రత్యేక సెల్ఫీ స్టాండ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

అనంతరం పీజీఆర్ఎస్ హాల్లో రెడ్‌క్రాస్ రూపొందించిన అవయవ దాన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం అధికారులకు అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన లెక్చరర్ బి. సురేష్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవయవ దానానికి సంబంధించిన విధానం, ప్రాముఖ్యత, అపోహలు, అవయవ దాతలుగా నమోదు చేసుకునే ప్రక్రియ తదితర అంశాలను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష, జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

200 మందికి పైగా అవయవ దానానికి అంగీకారం
అవయవ దానంపై నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అధికారులు, సిబ్బంది, ప్రజలు కలిపి 200 మందికి పైగా అవయవ దానానికి అంగీకారం తెలుపుతూ నమోదు చేసుకున్నారు. అనంతరం వారు ‘ఐ సపోర్ట్ ఆర్గాన్ డొనేషన్’ సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగి అవయవ దానానికి తమ మద్దతును చాటుకున్నారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కూడా అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవయవ దానం ద్వారా సమాజానికి అందించగల సేవ, అవయవ దానంపై ఉన్న అపోహలు, దాతలుగా నమోదు చేసుకునే విధానం తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు
Arattai