
అమరావతి, సెప్టెంబర్ 29 :* మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈలోపుగానే రాష్ట్రంలోని అన్ని చెరువులను రిజర్వాయర్లతో పాటు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని చెరువులను అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

భూగర్భ జలాలు పెరగాలి, కరువు అనేది తలెత్తకూడదని… దీనికి జిల్లా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సీఎం చెప్పారు. రాయలసీమ వరకు చూస్తే ఇంకా 9 టీఎంసీల నీటిని చెరువుల్లో నింపాల్సి ఉందన్నారు. ఒక పక్కన కృష్ణా, గోదావరి నుంచి రోజూ వేల క్యూసెక్కుల కొద్దీ వరద జలాలు సముద్రంలో కలుస్తుంటే… మరోవైపు 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు పోరాడాల్సి వస్తోందని… నీటి విలువను గుర్తించి పనిచేయాలన్నారు.

రాష్ట్రంలో 19 లక్షల వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని… వాటి ద్వారా లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని… ఇందుకు భూగర్భ జలాలు పెంచడం తప్పనిసరి అన్నారు.
గత ఏడాది కన్నా నిండుగా జలాశయాలు
రాష్ట్రంలో మేజర్, మీడియం రిజర్వాయర్ల సామర్ధ్యం 1,106 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 965 టీఎంసీల నీటిని నింపినట్టు… గతేడాది ఇదే సమయానికి 907 టీఎంసీల మేరకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మరో 13 శాతం మేర రిజర్వాయర్లు నింపాల్సి ఉందని వివరించారు. అలాగే రాయలసీమ వరకు చూస్తే మేజర్ రిజర్వాయర్లు 17 శాతం, మీడియం రిజర్వాయర్లు 22 శాతం నిండాల్సి ఉందన్నారు. ఈ సమీక్షకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు.
Leave a Reply