AMARAVATHI Feb:14 –రైతన్నా మీకోసం” కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచసూత్రాల అమలుతో రాష్ట్ర వ్యవసాయానికి కొత్త ఊపిరి పోస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. శనివారం శాసనసభలో 2026–27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ & అనుబంధ శాఖలకు మొత్తం రూ.53,752.12 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, 62 శాతం జనాభా వ్యవసాయ,అనుబంధ రంగాలపై ఆధారపడిన రాష్ట్రంలో రైతును “రాజు”గా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర- 2047 విజన్లో ‘ఫార్మర్స్ అగ్రిటెక్’ కీలక సూత్రంగా తీసుకొని AI, IoT, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ సాంకేతికతతో వ్యవసాయాన్ని అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డిమాండ్ మార్పులకు అనుగుణంగా పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ, పురుగు మందులు,ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువల పంటల సాగే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పంట కోత అనంతర నష్టాలు తగ్గించి విలువ జోడింపు పెంచడం, గిట్టుబాటు ధరల కల్పన, ప్రకృతి వ్యవసాయం విస్తరణ, రైతు సేవా కేంద్రాల స్థాయిలో పంట ప్రణాళిక అమలు వంటి చర్యలతో రైతు ఆదాయం పెంచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది
వసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో 62 శాతం జనాభా, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుంది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్ధికంగా సుభిక్షముగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ఠం చేసి, రైతును “రాజుగా” నిలబెట్టాలనే సంకల్పంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో NDA ప్రభుత్వంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే, వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలి. అందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “స్వర్ణాంధ్ర 2047” సాధన కోసం రూపొందించిన పది సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి “ఫార్మర్స్ అగ్రిటెక” ముఖ్యమైన సూత్రంగా ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా, వ్యవసాయాన్ని లాభదాయకంగా మరియు అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశా నిర్దేశం చేస్తున్నారు.

డిమాండ్ ఆధారిత పంటలు, పోషక విలువలు, ప్రకృతి వ్యవసాయం
ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల ఆధారంగా, డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకప్పుడు ప్రజలకి మూడు పూటలా తిండి దొరికితే చాలు, ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావవంతమైన ప్రభుత్వాలుగా భావించబడేవి. కానీ నేడు అంతకుమించి, మన విజనరీ సీఎం గారు పురుగుమందులు, ఎరువుల అవశేషాలు లేని, అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగుచేసే ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతోంది. అందుకు, ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుండి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగువైపు పంటల మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువ జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలుగా స్వీకరించాం.

సాగునీటి భద్రత, ప్రాజెక్టుల పూర్తి దిశగా
చేతికి వచ్చే పంటను కాపాడుకోవడానికి చినుకు కోసం రైతు ఆకాశం వైపు ఆశగా చూసే దౌర్భాగ్యం పోవాలి. వ్యవసాయం ఋతుపవనాలతో జూదం అనే నానుడి పోవాలి. అందుకు మా విజనరీ సీఎం గారి ముందుచూపుతో అటు స్థిరమైన సాగునీటి సౌకర్యాల కల్పన మరియు బిందు సేద్యం పై ప్రత్యేక దృష్టిసారించాం. పోలవరం, పట్టిసీమ, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార-నాగావళి అనుసంధానం, తోటపల్లి, మహేంద్రతనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్-I&II, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్ల పునరుద్ధరణ, వెలిగొండ, తారకరామతీర్థసాగరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి, ప్రతి ఎకరాకీ సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
రాష్ట్ర వ్యవసాయ రంగ ప్రగతి… కీలక గణాంకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GSDP 17,62,357 కోట్ల రూపాయలు కాగా వ్యవసాయ రంగం వాటాగా 33.20 శాతం తో 5,39,454 కోట్ల రూపాయలు అందించింది. భారతదేశం యొక్క వ్యవసాయం వృద్ధి రేటు 0.80 శాతం కాగా, మనరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలవలన, మనరాష్ట్ర వ్యవసాయరంగ వృద్ధి రేటు 7.83 శాతంగా నమోదయింది. దేశ వ్యవసాయరంగ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10 శాతం అని గర్వంగా తెలియజేస్తున్నాను.
2026-27 ఆర్ధిక సంవత్సరంలో ప్రతిపాదనలు:
షెడ్యూల్డు కులాలు / షెడ్యూల్డు తెగలు, పేద పశుపోషకులకు 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించాం. నూరు శాతం రాయితీపై 2.65 లక్షల ఎకరాలలో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధికి ప్రతిపాదించాము. వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాకు ఐదు చొప్పున ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో గోశాలలను నిర్మించాలని, ప్రతిపాదించాము. పశుగ్రాస భద్రతకొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయితీపై పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించు యంత్రాలు, మాగుడు గడ్డి తయారీ యంత్రాలు, పశు దాణా, మాగుడుగడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతుంది. పశువులు/జీవాలు మరణించినట్లైతే పరిహారం చెల్లించడం జరుగుతుంది. 380 పశువైద్యశాల మరమ్మత్తులు, 400 కొత్త పశువైద్యశాలలు నిర్మాణం దశల వారీగా చేపడతాము. మనుషులకు ఆధార్ ఉన్నట్లుగా పశువుల గుర్తింపుకు గో-ఆధార్ పథకాన్ని తీసుకువస్తున్నాము. ఫింగర్ ప్రింట్ వలే పశువుల ముక్కుమీద చర్మం ప్రింట్ ఆధారంగా గుర్తింపుని నమోదు చేస్తాము. దీని ఆధారంగా పశుబీమా ఇతర పథకాలు వర్తిస్తాయి. 2026-27లో పశుసంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించాం.
Arattai