NANDYAL Mar 18 :- దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో, సమాన అవకాశాలతో జీవించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంద్రధనుస్సు’ కార్యక్రమంలో భాగంగా ‘దివ్యాంగ శక్తి’ (ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం) పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.

బుధవారం స్థానిక నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో “దివ్యంగ శక్తి” పథకాన్ని రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వారు స్వేచ్ఛగా తిరిగేలా ప్రభుత్వం భరోసా ఇస్తోందని తెలిపారు.

ఈ పథకం ద్వారా దివ్యాంగులు విద్య, ఉపాధి, మరియు ఆరోగ్య అవసరాల కోసం ఎక్కడికైనా సులభంగా వెళ్లవచ్చు అని, ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. ఏ ఒక్క పౌరుడు వివక్షకు గురికాకూడదనే లక్ష్యంతో, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పానికి ఈ కార్యక్రమమే నిదర్శనం అన్నారు.

జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల శ్రేయస్సు కోసం “దివ్యాంగ శక్తి” అనే పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా పిడబ్ల్యుడి చట్టంలోని 21 వైకల్యాలు ఉన్న దివ్యాంగులు సిటీ బస్సులు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నారు.

అదేవిధంగా దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి కూడా టికెట్ ధర మొత్తంలో 50 శాతం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రీమియం ఏసి, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు కూడా 50% టికెట్ రుసుములో మినహాయించే అవకాశం ఉంటుందన్నారు.
Arattai