NANDYAL Mar 19 :- నంద్యాల సాహితీ లోకానికి వన్నెతెచ్చిన “సరస కవి” డా.వైష్ణవ వెంకట రమణమూర్తి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు.
పద్యాన్ని ప్రాణంగా భావించే డాక్టర్ రమణమూర్తి పలు సాహిత్య పుస్తకాలను రచించారు. డాక్టర్ రమణమూర్తి 32 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు అనంతరం జూనియర్ కళాశాల అధ్యాపకునిగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పదోన్నతి పొందారు. పదవీ విరమణ అనంతరం “చిన్నయ సూరి సాహితీ సమితి” స్థాపించి నంద్యాల జిల్లాలో అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అష్టావధానాలు, కవి సమ్మేళనాలు ,ప్రముఖ సాహితీవేత్తలచే ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తూ సాహితీ సేవలు కొనసాగిస్తున్నారు .
ఛాత్రోపాధ్యాయులచే “భువనవిజయం” సాహితీ రూపకాన్ని ప్రదర్శింపజేశారు. 2021 వ సంవత్సరంలో రమణ మూర్తి రచించిన “ఆళ్వారుల చరిత్ర” పుస్తకావిష్కరణలో పూర్వ విద్యార్థులు ఆయనను గండ పెండేరంతో సత్కరించారు. నాయనార్ల చరిత్ర, రమణీయకవన మంజరి, వెంకటేశ్వర శతకం లాంటి పుస్తకాలు పాఠకుల ఆదరణ పొందాయి..
డాక్టర్ రమణమూర్తి ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా నంద్యాల కళారాధన సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్, డాక్టర్ రవి కృష్ణ ,వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు,అన్నెం శ్రీనివాసరెడ్డి, డా. రవీంద్రనాథ్, డాక్టర్ గెలివి సహదేవుడు, డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
Arattai