NANDYAL April 22 :- స్వచ్ఛమైన, నాణ్యమైన మందులు తక్కువ ధరలకు అందించడమే జన ఔషధీ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. బుధవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జేఎస్‌డబ్ల్యూ, రాంకో, రేన్ సిమెంట్ కంపెనీల సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ మెడికల్ స్టోర్‌ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో ఈ జన ఔషధీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసి ఈ మెడికల్ షాప్‌ను రెడ్ క్రాస్ సంస్థకు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచి, సేవలను విస్తృతం చేయాలని రెడ్ క్రాస్ ప్రతినిధులను సూచించారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో తక్కువ వ్యవధిలోనే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, “మీ ఇంటికి మీ డాక్టర్” వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఇప్పుడు పేద ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరల్లో అందించేందుకు జన ఔషధీ మెడికల్ స్టోర్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు.
పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జన ఔషధీ పథకం ద్వారా నాణ్యమైన మందులు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. నంద్యాలలో ఈ కేంద్రం ఏర్పాటు కావడానికి మంత్రి, జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ప్రతినిధుల సమిష్టి కృషి కారణమని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ సుదర్శనం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1 లక్ష విరాళం అందజేశారు. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కంపెనీ రూ.3,21,779 (మందులు మరియు పరికరాల కోసం), రాంకో సిమెంట్ రూ.3 లక్షలు (భవనం మరమ్మతులు, మౌలిక సదుపాయాల కోసం), రేన్ సిమెంట్ రూ.1 లక్ష, జిల్లా కలెక్టర్ కార్యాలయం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సహకరించిన సంస్థలు, ప్రతినిధులను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహకరించిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కంపెనీ ప్రతినిధి గంగాధర్ కురుప్, రాంకో సిమెంట్ కంపెనీ ప్రతినిధి శోభన్ బాబు, రేన్ సిమెంట్ ప్రతినిధి ఆనంద్ భాస్కర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సెక్రటరీ వజ్రాల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ మమతా రెడ్డి, ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Arattai