NANDYAL June13:- వాల్మీకి రామాయణము – కుటుంబ విలువలు” అనే అంశంపై అంతర్జాల సదస్సులో పాల్గొని ప్రశంసలు అందుకున్న నంద్యాల సాహితీవేత్తలు అన్నెం శ్రీనివాస రెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు , నీలకంఠమాచారి మహబూబ్ బాష లను శనివారం నంది రైతు సమాఖ్య కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వీరు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నంది రైతుసమాఖ్య, మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో “రామాయణం – వర్తమాన సమాజం” అనే అంశంపై ప్రత్యేక ప్రసంగ కార్యక్రమం నిర్వహించారు. నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదరబాద్ రవీంద్రనాథ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవులు, రచయితలు సమాఖ్య సభ్యులు ఆదికవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి రామాయణం ఔన్నత్యాన్ని స్మరించుకున్నారు. అనంతరం డాక్టర్ కాదరబాద్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ రామాయణం కేవలం ఒక ఇతిహాస గ్రంథం మాత్రమే కాకుండా మానవ జీవితానికి విలువలను బోధించే జీవనవేదమని పేర్కొన్నారు.

డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ కుటుంబ బాంధవ్యాలు, పరస్పర గౌరవం, త్యాగం, కర్తవ్యనిర్వహణ, ధర్మాచరణ వంటి విలువలు రామాయణంలో ప్రతిఫలిస్తాయని, అందుకే రామాయణం మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, డా.నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మూలస్తంభంగా నిలిచిన రామాయణం కుటుంబ వ్యవస్థకు అవసరమైన అనేక ఆదర్శాలను వర్తమాన సమాజానికి బోధిస్తుందన్నారు.

ముఖ్య అతిథి డాక్టర్ గెలివి సహదేవుడు ను సమాఖ్య సభ్యులు సత్కరించారు. అంతర్జాల సదస్సులో పాల్గొని ప్రశంసలు అందుకున్న నంద్యాలకు చెందిన సాహితీవేత్తలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారు పంపిన ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కవులు గద్వాల రామకృష్ణ, మహమ్మద్ రఫీ, డా.కిశోర్ కుమార్ తదితరులు రామాయణ విశేషాలపై కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత శాస్త్రవేత్తలు కైలాసనాధ రెడ్డి, మాధవస్వామి, నంది రైతు సమాఖ్య నాయకులు చంద్రశేఖర రెడ్డి, మధుసూదన్ రెడ్డి సమాఖ్య సభ్యులు బాలచంద్రుడు, శ్రీనివాస రెడ్డి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Arattai