NANDYAL July11:- నంద్యాల పట్టణంలో తొలిసారిగా శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రను ఈ నెల 16వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ నంద్యాల శాఖ అధ్యక్షులు రఘువంశ రామ్ దాస్ తెలిపారు.

శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్నాథ రథయాత్ర పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్ గేట్ మీదుగా సౌజన్య కన్వెన్షన్ హాల్ వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగుతుందని చెప్పారు. ఈ రథయాత్రలో భజన బృందాలు, హరినామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

రథయాత్ర ముగిసిన అనంతరం సౌజన్య కన్వెన్షన్ హాల్లో శ్రీ జగన్నాథ స్వామివారి లీలా కథా ప్రవచనం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులందరికీ మహాప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు.

నంద్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, శ్రీ జగన్నాథ స్వామివారి కృపకు పాత్రులు కావాలని రఘువంశ రామ్ దాస్ కోరారు.
Arattai