NANDYAL July18 :- జూలై 20వ తేదీ అంతర్జాతీయ చెస్ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో,నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో శనివారం నంద్యాలలో రామకృష్ణ పిజి కళాశాల ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా,నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్షులు, శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్,రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు,విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. కేవలం చదువు మాత్రమే ఉంటే సరిపోదని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. ఈ చదరంగం క్రీడ వారిలో ఏకాగ్రత పెంచుతుందని అన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులలో కృత్రిమ మేధ వినియోగం పెరిగితే వారి మెదళ్లు సృజనాత్మకంగా ఆలోచన చేసే శక్తిని కోల్పోతారని,చదరంగం వారి మేధో శక్తికి పదును పెడుతుందని అన్నారు.సుధాకర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో చెస్ క్రీడకు ప్రాచుర్యం పెరగడానికి జిల్లా చెస్ సంఘం కృషి ప్రశంసనీయమన్నారు. క్రీడలలో ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించాలని కోరారు.
హేమంత రెడ్డి మాట్లాడుతూ రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర సంఘం తరపున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి, టోర్నమెంట్ నిర్వాహకులు రామసుబ్బారెడ్డి, చీఫ్ ఆర్బిటర్ వెంకట కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 264 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, అందులో 124 మంది ఫీడే రేటింగ్ ఉన్న క్రీడాకారులని తెలిపారు. ఆదివారం సాయంత్రం ముగింపు ఉత్సవంలో విజేతలకు పతకాలు, ట్రోఫీలు బహూకరించడం జరుగుతుందని తెలిపారు.

డాక్టర్ రామకృష్ణారెడ్డి రిబ్బన్ కత్తిరించి ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లాంచనంగా ప్రారంభించారు.అనంతరం డాక్టర్ రవి కృష్ణ,హేమంత రెడ్డి చెస్ బోర్డు పై పావులు కలిపి చదరంగం పోటీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్, రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత రెడ్డి,చీఫ్ ఆర్బిటర్ వెంకట కుమార్,జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం కార్యవర్గ సభ్యులు, కర్నూలు జిల్లా చెస్ సంఘం కార్యదర్శి కామిశెట్టి శ్రీనివాస్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ ,జోన్ చైర్మన్ సోమేశుల నాగరాజు, సంయుక్త కార్యదర్శి అమిదేల జనార్ధన్, సహా కోశాధికారి డాక్టర్ శ్రవణ్,సభ్యులు జగన్, జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి,ఇమామ్, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన చదరంగం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Arattai