NANDYAL July27:-ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ అర్జీలను కేవలం ఆన్లైన్లో నమోదు చేసి ముగించడం కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులతో వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, పిజిఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటి వెలుపల పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ పోస్టర్లు, క్యూ ఆర్ కోడ్లు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అర్జీదారులు క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ ఫిర్యాదుల పరిష్కారంపై అభిప్రాయం తెలియజేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

ఫీడ్‌బ్యాక్ ప్రశ్నావళిలో అధికారి ప్రవర్తన, మర్యాద, నిబంధనల ప్రకారం వ్యవహరించారా, ఎలాంటి బెదిరింపులు లేదా అవినీతికి పాల్పడలేదా, సరైన సమాచారం, ఎండోర్స్మెంట్ ఇచ్చారా, సమస్య పరిష్కారంపై ఎంత మేర సంతృప్తి చెందారనే అంశాలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీలను యాంత్రికంగా క్లోజ్ చేయకుండా బాధితుడి స్థానంలో నిలబడి సానుభూతితో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారం చేసే క్రమంలో జాప్యం వహించకుండా బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లేంత వరకూ ఎదురుచూడకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. రీ-ఓపెన్ అయిన పిటిషన్ల విషయంలో అధికారులు కేవలం నివేదికలు సమర్పించడం కాకుండా, ఫిర్యాదుదారులను నేరుగా పిలిపించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. భూసేకరణ, సబ్‌డివిజన్, ఆక్రమణలు వంటి సంక్లిష్ట సమస్యలను విడివిడిగా విశ్లేషించి దశలవారీగా పరిష్కరించాలని తెలిపారు.

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 199 అర్జీల స్వీకరణ
భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తంగా 199 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి 4, అడంగల్ సవరణలకు సంబంధించినవి 13, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి 25, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 50, రెవెన్యూ కోర్టు విచారణలు/ఆర్ఓఆర్కు సంబంధించినవి 43, సర్వే, రీ-సర్వేలకు సంబంధించినవి 54, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి 10గా ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
Arattai