NANDYAL July26 :- నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ ఈ.ఎన్.టి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో,నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వహణలో స్థానిక మధు మణి చెవి,ముక్కు,గొంతు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శని,ఆది వారాలలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి చెవి,ముక్కు, గొంతు వైద్య వైజ్ఞానిక సదస్సు,శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసార శిక్షణా కార్య శాల ( వర్క్ షాప్) నిర్వహించారు.

మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ నాగమణి డాక్టర్ మణిదీప్ ల నిర్వహణలో ఎర్పాటు చేసిన ఈ రెండు రోజుల సదస్సు లో ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్ టి వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్, ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ వేణుగోపాలరెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ సింగరి ప్రభాకర్, అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ శస్త్ర చికిత్సల కార్యశాల మరియు సదస్సు నిర్వహిస్తున్నామని ఇది 16 వ సదస్సు అన్నారు.పలు రాష్ట్రాల నుండి చెవి ముక్కు గొంతు వైద్యులు నంద్యాలకు ఆధునిక శస్త్ర చికిత్సల శిక్షణ కోసం రావడం నంద్యాలకు గర్వకారణం అన్నారు.నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ ఈ రెండు రోజుల సదస్సులో ఆరు రాష్ట్రాల నుండి 170 మంది చెవి, ముక్కు, గొంతు వైద్యులు ప్రతినిధులుగా పాల్గొని మధు మణి సమావేశ భవనంలో స్క్రీన్ పైన, ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో జరుగుతున్న శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసారం తిలకిస్తూ ఆపరేషన్ చేస్తున్న వైద్యునితో తమ సందేహాలు నివృత్తి చేసుకుని శిక్షణ పొందుతారని తెలిపారు.

డాక్టర్ అహిలా స్వామి,డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక సదస్సులు యువ వైద్యులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని అన్నారు.ఆదివారం జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు,రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే యువ వైద్యులు నిరంతరం ఆధునిక విధానాలను నేర్చుకుని నైపుణ్యాలను పెంచు కోవలసిన అవసరం ఉందని అన్నారు.
డాక్టర్ సింగరి ప్రభాకర్ మాట్లాడుతూ వైద్య రంగంలో అనునిత్యం గణనీయమైన మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయని, వాటిని తెలుసుకోవడం కోసం వైద్యులు నిరంతర అధ్యయనం చేయడం చాలా అవసరం అన్నారు.జాతీయస్థాయి ప్రముఖ చెవి ముక్కు గొంతు చికిత్స నిపుణులు డాక్టర్ అహిలా స్వామి, డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి,డాక్టర్ మధుసూదన రావు, మధుమణి ఆసుపత్రి చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు మణిదీప్ కలసి రెండు రోజులలో 20 శస్త్ర చికిత్సలు చేస్తూ యువ వైద్యులకు మెళకువలు వివరించారు. ఆపరేషన్లకు అవసరమైన క్లిష్టమైన అనస్తీసియా ప్రక్రియ ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మాధవి, డాక్టర్ వంశీ నిర్వహించారు.
డాక్టర్ అహిలా స్వామి, డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి లను డాక్టర్ మధుసూదన రావు కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు.
సదస్సు ప్రారంభ, ముగింపు కార్యక్రమాలలో డాక్టర్ నాగమణి,సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మణిదీప్, కోఆర్డినేటర్ డాక్టర్ రోహిత్, డాక్టర్ లోచన రెడ్డి,మధుమణి కుటుంబ సభ్యులు డాక్టర్ మధుప్రీతి,ప్రణీత్, సింధు,వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 170 మంది చెవి ముక్కు గొంతు వైద్యులు పాల్గొన్నారు.
Arattai