NANDYAL July10 :- జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని గ్రామీణ యువత, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ లో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకం కింద ఏర్పాటు చేసిన ఎస్ఎస్ డైరీ మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. యూనిట్లో తయారు చేస్తున్న పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్ తదితర ఉత్పత్తుల తయారీ ప్రక్రియను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా క్రెడిట్ లింక్డ్ రుణ సదుపాయం కల్పిస్తోందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్థానిక వనరుల ఆధారంగా మరిన్ని పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. విశ్వనగర్‌లో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ అండ్ కర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ సుమారు రూ.18.14 లక్షల వ్యయంతో స్థాపించబడిందన్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి రూ.6.35 లక్షల సబ్సిడీ, బ్యాంకు ద్వారా రుణం, యజమాని స్వంత పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ యూనిట్ విజయవంతంగా స్థాపించబడిందని తెలిపారు.

ఇలాంటి సూక్ష్మ పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలుగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఐదు నుంచి పది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తే నెలకు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటువంటి పరిశ్రమలు కుటుంబాల ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి విస్తరణకు దోహదపడతాయని తెలిపారు. జిల్లాకు పీఎంఎఫ్ఎంఈ పథకం కింద మొత్తం 56 యూనిట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 26 యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన యూనిట్లను కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేసేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి స్థానిక వనరులకు అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి మరిన్ని మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకర్లు అర్హులైన లబ్ధిదారులకు రుణాలను సత్వరమే మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించాలని కోరారు.

‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్’ లక్ష్యంతో ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. దీని ద్వారా జిల్లా స్థూల ఆర్థికాభివృద్ధి (GDP), తలసరి ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో మిల్లెట్స్ ప్రాసెసింగ్, తేనె సేకరణ మరియు ప్రాసెసింగ్, ఫ్లోరికల్చర్ ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, వెట్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా పెద్ద ఎత్తున సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాబార్డ్ ఏజీఎం కార్తికేయ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్, ఎల్డిఎం అయ్యప్ప రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Arattai